Earthquake : భారీ భూకంపం.. ఇళ్ల నుంచి రోడ్లపైకి జనం పరుగులు

by Hajipasha |
Earthquake : భారీ భూకంపం.. ఇళ్ల నుంచి రోడ్లపైకి జనం పరుగులు
X

దిశ, నేషనల్ బ్యూరో : దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం వనౌటు(Vanuatu)ను మంగళవారం భూకంపం(Earthquake) వణికించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. ప్రజలు కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలను ఫీలయ్యారు. దీంతో చాలా ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రాన్ని దేశంలోని అతిపెద్ద నగరమైన పోర్ట్‌ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఈ భూకంపం తర్వాత పలుమార్లు ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని వెల్లడైంది. భూకంపం ప్రభావంతో పలుచోట్ల భవనాలు నేలకూలాయి.

పోర్ట్‌ విలా నగరంలో పలు దేశాల రాయబార కార్యాలయాలున్న భవనం బాగా ధ్వంసమైంది. ఈ భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే అమెరికా, ఫ్రాన్స్‌ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనం పైఅంతస్తులు కూలిపోవడంతో ఈ ఆఫీసులు దెబ్బతిన్నాయి. భూకంప సంబంధిత ఘటనల్లో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. చనిపోయిన వారి సంఖ్య పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. వనౌటు దేశంలో 80 చిన్న చిన్న దీవులు ఉన్నాయి. ఈ దేశ జనాభా దాదాపు 3.30 లక్షలు. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌జోన్‌లో ఉండటంతో ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి.

Advertisement

Next Story