ముంబైలో తొలి చినుకు..భారీ ధూళి తుఫాను

by S Gopi |
ముంబైలో తొలి చినుకు..భారీ ధూళి తుఫాను
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఏడు తొలి జల్లు కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారీ ఎత్తున ధూళి తుఫాన్ రావడంతో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. విపరీతమైన దుమ్ము ఎగసి పడటంతో నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీయడం, కొన్ని చోట్ల వర్షం కురిసింది. ముంబైలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులు, వర్షం పడింది. థానే, పాల్గర్ లాంటి చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆ ప్రాంతాల్లో గాలులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకూలాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు భారీ దుమ్ము తుఫాను కారణంగా 30 నిమిషాల పాటు నిలిపివేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story