Marital rape case : వైవాహిక అత్యాచారం కేసు.. సీజేఐ కీలక ఆదేశం

by Hajipasha |
Marital rape case : వైవాహిక అత్యాచారం కేసు.. సీజేఐ కీలక ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : వైవాహిక అత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీన్ని తదుపరి విచారణ కోసం నాలుగు వారాల తర్వాతికి లిస్టింగ్ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో త్రిసభ్య బెంచ్ ఆదేశించింది. భార్యను భర్త లైంగికంగా బలవంతం చేయడాన్ని అత్యాచార నేరంగా పరిగణించాలా ? వద్దా ? అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతోంది. దీనిలో పలువురు పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించిన న్యాయవాదులు.. వాదనలను పూర్తి స్థాయిలో వినిపించేందుకు తమకు కనీసం మరో రోజు సమయం ఇవ్వాలని కోరారు. వారందరి వాదనలను తప్పకుండా వినాల్సి ఉంటుందని సీజేఐ పేర్కొన్నారు.

దీపావళి కంటే ముందే ఈ కేసులో వాదనలు ముగిసిపోతే, తీర్పును రిజర్వ్ చేయొచ్చని భావించామన్నారు. కానీ అది జరిగే పరిస్థితి లేనందున.. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు రీలిస్టింగ్ చేయాలని ఆదేశిస్తున్నట్లు జస్టిస్ డీవై చంద్రచూడ్ వివరించారు. ఈనెల 25 నుంచి నవంబరు 4 వరకు సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు ఉన్నాయి. సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ చివరి పనిదినం నవంబరు 8. ఆయన నవంబరు 11న రిటైర్ కానున్నారు. అందుకే వైవాహిక అత్యాచారం కేసును నాలుగు వారాల తర్వాత మరో ధర్మాసనం విచారణకు స్వీకరించనుంది.

Advertisement

Next Story

Most Viewed