మరాఠా కోటా సమస్యను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి: శరద్ పవార్

by vinod kumar |
మరాఠా కోటా సమస్యను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి: శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: మరాఠా కమ్యూనిటీ, ఇతర వెనుకబడిన తరగతుల కోటా డిమాండ్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. గురువారం ఆయన పూణె జిల్లాలోని బారామతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో రిజర్వేషన్ల సమస్యపై పెరుగుతున్న మరాఠా-ఓబీసీ వివాదం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర విధానాలలో పలు సవరణలు అవసరమని తెలిపారు. వీటిపై కేంద్రం మౌనాన్ని వీడితే సమస్య పరిష్కారం అయ్యే చాన్స్ ఉందన్నారు.

ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటే ప్రతిపక్షాలు రాజకీయాలను ఈ అంశంలోకి తీసుకురాబోవన్నారు. సామాజిక ఉద్రిక్తతను తగ్గించడానికి సహకరిస్తామని, కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే అన్ని పార్టీలను ఏకం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో, మరాఠా వర్గానికి ప్రత్యేక కేటగిరీ కింద విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే ఓబీసీ కింద కోటా ఇవ్వాలని మరాఠా సంఘం డిమాండ్ చేస్తోంది. కుంబీలను మరాఠాలుగా గుర్తించేలా చట్టం తేవాలని కోరుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను అమలు చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed