మరో మూడేళ్లలో మావోయిస్టు రహిత భారత్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by samatah |   ( Updated:2024-05-26 11:17:31.0  )
మరో మూడేళ్లలో మావోయిస్టు రహిత భారత్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: మరో రెండు మూడేళ్లలో దేశంలో మావోయిస్టుల సమస్య తీరిపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని కొంత ప్రాంతం మినహా దేశం మొత్తం నక్సలైట్ల ముప్పు నుంచి విముక్తి పొందిందని తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘దేశం నలుమూలల నుంచి మావోయిస్టులను అంతమొందించాం. ఒకప్పుడు పశుపతినాథ్‌ నుంచి తిరుపతి వరకు మావోయిస్టు కారిడార్‌ గురించి చెప్పేవారు. కానీ ఇప్పుడు దాని ఉనికి లేకుండా పోయింది. జార్ఖండ్‌, బిహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయి’ అని వ్యాఖ్యానించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు ఇప్పటికీ కార్యకలాపాలు సాగిస్తున్నారని, గత ఐదేళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున అక్కడ వారిని అంతమొందించలేకపోయారని అన్నారు. ఐదు నెలల క్రితం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఛత్తీస్‌గఢ్‌ను మావోయిస్టుల నుంచి విముక్తి చేసేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఫలితంగా సుమారు 125 మంది మావోయిస్టులు మరణించగా.. 352 మందికి పైగా అరెస్టయ్యారని తెలిపారు. అంతేగాక 175 మంది లొంగిపోయారని వెల్లడించారు. రాబోయే రెండు మూడేళ్లలో ఈ సమస్య పూర్తిగా సమసి పోతుందని తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌లో పోలింగ్ విజయవంతం అయిందని అమిత్ షా చెప్పారు. వేర్పాటువాదులు కూడా అధికంగా ఓట్లు వేశారని, మోడీ ప్రభుత్వ కశ్మీర్ విధానానికి ఇదే నిదర్శనమని నొక్కి చెప్పారు. సెప్టెంబర్ 30లోపు కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైందని దీంతో కశ్మీరీల వైఖరిలో పెద్ద మార్పు వచ్చిందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని భారత్‌లో విలీనం చేసే అంశంపై అడిగిన ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ..పీఓకే ముమ్మాటికీ భారత్ దేనని, తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ అంశం బీజేపీ మేనిఫెస్టోలో భాగమని సూచించారు.

Read More..

ఢిల్లీ చిల్డ్రన్ హాస్పిటల్ అగ్నిప్రమాదంపై స్పందించిన ప్రధాని మోడీ

Advertisement

Next Story