Manipur: మణిపూర్‌లో కఠినంగా వ్యవహరించండి.. భద్రతా బలగాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు

by vinod kumar |
Manipur: మణిపూర్‌లో కఠినంగా వ్యవహరించండి.. భద్రతా బలగాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌ (Manipur)లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర హోం మంత్రిత్వ (Ministry of Home Affairs) శాఖ కఠిన వైఖరి తీసుకుంది. శాంతి భద్రతల పునరుద్దరణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో మోహరించిన భద్రతా బలగాలను ఆదేశించింది. హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజలు శాంతి భద్రతలను కాపాడాలని, పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. కేంద్ర బలగాలకు సహకరించాలని కోరింది. ‘మణిపూర్‌లో భద్రతా పరిస్థితి గత కొన్ని రోజులుగా ఆందోళనకరంగా ఉంది. ఘర్షణలో ఉన్న రెండు వర్గాలకు చెందిన మిలిటెంట్లు హింసకు పాల్పడుతున్నారు. ప్రజా కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారు’ అని పేర్కొంది. పలు కేసుల విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కు అప్పగించన్నట్టు తెలుస్తోంది.

కాగా, ఇటీవల భద్రతా బలగాలు 11 మంది మిలిటెంట్లను కాల్చి చంపిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు భారీగా క్షీణించాయి. జిరిబామ్ జిల్లాకు చెందిన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురు పౌరులను మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. అంతేగాక నిత్యం మిలిటెంట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, హింసాత్మకంగా దెబ్బతిన్న జిరిబామ్ జిల్లాతో సహా ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో అఫ్సా చట్టాన్ని తిరిగి అమలు చేయనున్నట్టు తెలిపింది. గతేడాది మే నుంచి రాష్ట్రంలో హింస ప్రారంభంకాగా ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

Next Story

Most Viewed