బిగ్ బ్రేకింగ్.. మాణిక్కం ఠాగూర్ అవుట్

by Javid Pasha |   ( Updated:2023-01-04 13:55:48.0  )
బిగ్ బ్రేకింగ్.. మాణిక్కం ఠాగూర్ అవుట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ బిగ్ డిసిషన్ తీసుకున్నారు. టీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు మాణిక్కం ఠాగూర్ తన రాజీనామా లేఖను పంపించారు. మాణిక్కం ఠాగూర్ పై చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ పోస్టు విషయంలో ఆయనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరికొంత మంది సీనియర్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నేతలను సమన్వయం చేయడంలో ఠాగూర్ విఫలం అయ్యారని ఆరోపించారు. ముఖ్యంగా టీపీసీసీ పోస్టును మాణిక్కం ఠాగూర్ అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల పీసీసీ కమిటీల విషంలోనూ మరోసారి ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపిన అధిష్టానం ఆయన ఇచ్చిన నివేదికతో చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సీనియర్ల అలక, పార్టీలో తన పట్ల నెలకొన్న పరిస్థితులను ముందుగానే గ్రహించిన ఆయన తెలంగాణలో భారత్ జోడో యాత్ర సమయంలో ఈ విషయాన్ని రాహుల్ దృష్టికి ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకువెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ రిపోర్టుతో మాణిక్కం ఠాగూర్ ను మార్చాలనే నిర్ణయానికి అధిష్టానం రావడంతో ఆయన చేత రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. ఠాగూర్ రాజీనామాతో ఆయన స్థానంలోకి కొత్త ఇన్ చార్జ్ గా ఎవరు రాబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగనుంది. ఈ ప్లీనరీ తర్వాత కొత్త ఇన్ చార్జ్ తో పాటు పార్టీలో వివిధ కమిటీలను సైతం నియమించే అవకాశం చర్చ జరుగుతోంది. అయితే మాణిక్కం ఠాగూర్ రాజీనమాతో ఇన్నాళ్లు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్లు తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారా? ఈ ఎఫెక్ట్ తో టీకాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది మరింత ఆసక్తి రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed