- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల బాండ్లు, బ్లాక్ మనీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికలు సమీపించిన వేళ ఎలక్టోరల్ బాండ్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థను ఆయన సమర్ధించారు. ఎన్నికల బాండ్ల పద్ధతి వల్ల రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర నమోదై ఉంటాయన్నారు. ‘‘రాజకీయ పార్టీలకు విరాళం ఎవరు ఇచ్చారు ? ఎంత ఇచ్చారు ? అనేది తెలియాలంటే ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఉండాలి. ఈ లెక్కలన్నీ పకడ్బందీ నమోదు చేసి ఉంచే విధానం తప్పుగా ఎందుకు అనిపించింది ?’’ అని ప్రధాని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల వ్యవస్థ లేకుంటే నల్లధనం ఆగడాలకు ఆస్కారం ఏర్పడుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. “ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ రద్దయినందుకు అందరూ పశ్చాత్తాప పడతారు’’ అని ఆయన కామెంట్ చేశారు. ప్రముఖ వార్తాసంస్థ ‘ఏఎన్‌ఐ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో నల్లధనం వాడకానికి స్వస్తి పలకాలనే అంశంపై మన దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేస్తుంటాయి. ఈ మాటను ఎవరూ కాదనలేరు. మా పార్టీతో పాటు అన్ని పార్టీలూ డబ్బు ఖర్చు చేస్తాయి. అందుకోసం నేరుగా ప్రజల నుంచి విరాళాలను స్వీకరించే అవకాశం ఉండాలనే గొప్ప ఆశయంతోనే ఎన్నికల బాండ్ల వ్యవస్థను తెచ్చాం. దీనివల్ల నల్లధనానికి తావు ఉండదని భావించాం’’ అని ప్రధాని మోడీ వివరించారు. ‘‘ఎన్నికల బాండ్ల విషయంలో మా ఆలోచన స్వచ్ఛమైంది. ఎలాంటి దురుద్దేశం లేనే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల బాండ్ల వ్యవస్థకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందినప్పుడు దానిపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఇప్పుడు దానిపై విశ్లేషణలు చేస్తున్న వారిలో కొందరు అప్పట్లో బిల్లును సమర్థించారు’’ అని మోడీ చెప్పారు.
నోట్ల రద్దుపై కీలక వ్యాఖ్యలు
నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా తీసుకున్న రూ.1000, రూ.2000 నోట్ల రద్దు నిర్ణయాన్నిప్రధాని ఈసందర్భంగా ప్రస్తావించారు. ‘‘ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు రూ.1000, రూ.2000 నోట్లను పెద్దఎత్తున వాడేవి. అలాంటి ఆగడాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే వాటిని రద్దు చేశాం’’ అని ప్రధాని మోడీ తెలిపారు. ‘‘రాజకీయ పార్టీలకు ఇంతకుముందు రూ. 20,000 వరకు నగదు విరాళాలను అనుమతించేవారు. “ఈ నగదు వ్యాపారం” కొనసాగడం నాకు ఇష్టముండేది కాదు. అందుకే ఆ అమౌంట్‌ను రూ. 2,500కి మార్చాను’’ అని ఆయన పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై అబద్ధాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలపై మోడీ ఈసందర్భంగా విరుచుకుపడ్డారు. ‘‘రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన 3,000 కంపెనీలకుగానూ 26.. ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందని విపక్షాలు మర్చిపోకూడదు. ఈ 26 కంపెనీల్లో 16 ఎలక్టోరల్ బాండ్లను తీసుకున్నాయి. ఈ 16 కంపెనీలు ఇచ్చిన విరాళాల్లో 37 శాతం బీజేపీకి, 63 శాతం ప్రతిపక్ష పార్టీలకు దక్కాయి’’ అని ప్రధాని వివరించారు. ఈ తరహా విరాళాల్లో 63 శాతం ప్రతిపక్షాలకు వెళ్లినా.. ఆరోపణలు మాత్రం బీజేపీపై వస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.
జమిలి ఎన్నికలతో ప్రయోజనం ఉంటుందా?
‘‘మీరు సరైన అంశాన్ని లేవనెత్తారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది మా నిబద్ధత. మేం పార్లమెంట్‌లో మాట్లాడాం. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక కూడా వచ్చింది. ఒకే దేశం ఒకే ఎన్నికల పరంగా దేశంలో చాలా మంది తమ సలహాలను కమిటీకి అందించారు. చాలా సానుకూలమైన, వినూత్నమైన సూచనలు వచ్చాయి. మేం ఈ నివేదికను అమలు చేయగలిగితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది’’ అని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘నా దగ్గర పెద్ద ప్లాన్లు ఉన్నాయని చెబితే విని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరినీ భయపెట్టే నిర్ణయాలో.. పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చే నిర్ణయాలో తీసుకోను. దేశం అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటా. నేను చేయాల్సింది చాలా ఉంది’’ అని మోడీ అన్నారు.
‘‘ఓ నాయకుడు.. ఒక్క దెబ్బతో పేదరికాన్ని నిర్మూలిస్తాడట’’
‘‘ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు ప్రజలు చాలా ముఖ్యం. బూత్ లెవల్ కార్యకర్త కూడా చాలా ముఖ్యం. ఇటీవలే ఓ నాయకుడు నేను ఒక్క దెబ్బతో పేదరికాన్ని నిర్మూలిస్తాను అని అన్నారు. వీరికి అయిదు, ఆరు దశాబ్దాలు అధికారంలో ఉండే అవకాశం వచ్చింది. అయినా ఏం చేయని వారు.. ఇప్పుడు పేదరికాన్ని ఒక్క దెబ్బతో నిర్మూలిస్తామని చెబుతుంటే దేశ ప్రజలు ఎందుకు నమ్ముతారు ? మనం ఏం మాట్లాడుతున్నామో దానికి బాధ్యత తీసుకోవాలి. అది చేస్తాం ఇది చేస్తాం అనే మాటలు చెల్లవు. నేను అన్న మాటకు కట్టుబడి ఉంటాను. దానికి పూర్తి బాధ్యత వహిస్తాను’’ అని మోడీ తేల్చి చెప్పారు.