కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలవడమూ కష్టమే.. దమ్ముంటే మోడీపై గెలవండి: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

by Swamyn |
కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలవడమూ కష్టమే.. దమ్ముంటే మోడీపై గెలవండి: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో ఏ రేంజ్‌లో విభేదాలున్నాయో మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఏకంగా కూటమి నుంచే బయటకొచ్చి బీజేపీతో జట్టు కట్టగా, అలయన్స్‌లో కీలక పార్టీలైన ఆప్, టీఎంసీలు సైతం కాంగ్రెస్‌ను నిండా ముంచేలా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పంజాబ్, బెంగాల్‌లో కాంగ్రెస్‌తో సీట్లను పంచుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే తెగేసి చెప్పాయి. అంతటితో ఆగకుండా వరుస విమర్శలతో కాంగ్రెస్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హస్తం పార్టీపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ మాట్లాడుతూ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 స్థానాల్లో గెలవడం కూడా అనుమానమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ను కోరాను. కానీ, వాళ్లు వినలేదు. ఇప్పుడు వాళ్లు బెంగాల్ వచ్చి(రాహుల్ యాత్రను ఉద్దేశించి) ముస్లిం ఓటర్లలో గుబులు రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో పోటీచేస్తే కనీసం 40 స్థానాల్లోనైనా గెలుస్తారో లేదో.. తెలియదు. కానీ, వాళ్లకు ఇంకా ఎక్కువ సీట్లు కావాలట. అందుకే, ‘సరే అయితే.. బెంగాల్‌లో మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయండి’ అని చెప్పా. అందుకు వారు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చలు జరగలేదు’’ అని మమతా బెనర్జీ వెల్లడించారు.

కాంగ్రెస్‌కు దమ్ముంటే..

కాంగ్రెస్‌కు దమ్ముంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాషాయ పార్టీని ఓడించాలని సవాల్ విసిరారు. ‘‘మీకు(కాంగ్రెస్‌ను ఉద్దేశించి) దమ్ముంటే లోక్‌సభ ఎన్నికల్లో యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీని ఓడించండి. మీకు ధైర్యముంటే వారణాసిలో మోడీని ఓడించండి. ఇంతకు ముందు గెలిచిన స్థానాలన్నీ కోల్పోతూ వస్తున్నారు. కానీ, మీకు బెంగాల్‌లో ఎక్కువ సీట్లు కావాలా? మణిపూర్‌ మండుతున్నప్పుడు ఎక్కడికెళ్లారు? మహిళలను నగ్నంగా పరుగెత్తించినప్పుడు, 200 చర్చ్‌లకు నిప్పు పెట్టినప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు మాత్రం బెంగాల్‌లోకి వచ్చి టీ స్టాళ్ల వద్ద ఫొటో షూట్లు(రాహుల్‌ను ఉద్దేశించి) చేయించుకుంటున్నారు’’ అని మండిపడ్డారు.

చెప్పకుండా నా రాష్ట్రానికి ఎలా వస్తారు?

రాహుల్ గాంధీ బెంగాల్‌లో న్యాయ్ యాత్ర చేయడంపై మమత స్పందిస్తూ, ‘‘వాళ్లు బెంగాల్‌కు వచ్చి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నేను ఇండియా కూటమిలో ఒక మెంబర్‌ని అయినప్పటికీ, నా రాష్ట్రానికి వచ్చి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని అధికారులు చెబితేనే తెలుసుకున్నాను’’ అని వెల్లడించారు.


Advertisement

Next Story

Most Viewed