‘మీకు తప్పుడు సమాచారమిస్తున్నారు’.. ప్రధాని మోడీకి ఖర్గే బహిరంగ లేఖ

by Hajipasha |
‘మీకు తప్పుడు సమాచారమిస్తున్నారు’.. ప్రధాని మోడీకి ఖర్గే బహిరంగ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘కాంగ్రెస్ పార్టీ దేశ సంపదను చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచుతుంది’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. వాస్తవానికి అలాంటి వివాదాస్పద అంశాలేవీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేవని ఖర్గే స్పష్టం చేశారు. ‘‘మా మేనిఫెస్టోలో లేని విషయాల గురించి మీ సలహాదారులు మీకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. వాటినే మీతో చెప్పిస్తున్నారు’’ అని కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఖర్గే తప్పుపట్టారు. ‘‘ఇవన్నీ అయిపోయాక.. ఎన్నికల ఘట్టం ముగిసిపోయాక జరిగిన విషయాలన్నీ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే దేశ ప్రధాని అప్పట్లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించారని ప్రజలు గుర్తుంచుకుంటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే.. మా సోదరీమణుల దగ్గర ఎంత బంగారం, వెండి ఉందనేది తనిఖీల ద్వారా తెలుసుకుంటారు. బంగారం కేవలం ధరించే వస్తువే కాదు.. అది మహిళల ఆత్మగౌరవం. మంగళసూత్రం విలువ బంగారం ధరకే పరిమితం కాదు, అది వారి జీవితాల కలలతో ముడిపడిన అంశం. కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా లాక్కోవాలని ఆలోచిస్తోంది’’ అని రాజస్థాన్ సభలో మోడీ కామెంట్ చేయడం దుమారం రేపింది.

Advertisement

Next Story