మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు..భారీగా పార్టీలు మారనున్న ఎమ్మెల్యేలు!

by vinod kumar |
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు..భారీగా పార్టీలు మారనున్న ఎమ్మెల్యేలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: గత ఏడాదిన్నర కాలంగా మహారాష్ట్ర రాజకీయాలు నిరంతరం సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారాయి. ఏకంగా రెండు ప్రముఖ పార్టీలు శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీపీ)లు వర్గాలుగా చీలిపోయాయి. అయితే ఈ చీలికల అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) పార్టీలు సత్తా చాటాయి. మొత్తం 48 స్థానాలకు గాను ఈ రెండు పార్టీలు 9 స్థానాల్లో గెలుపొందగా.. వారితో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ 13 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే గతంలో శివసేనను వీడిన ఎమ్మెల్యేలు, ఎన్సీపీ నుంచి వెళ్లిన నేతలు ఉద్థవ్, శరద్ పవార్ వర్గాల్లో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నట్టు తెలుస్తోంది.

అజిత్ పవార్ ఎన్సీపీకి చెందిన సుమారు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌తో టచ్‌లో ఉన్నారని కథనాలు రాగా..తాజాగా సీఎం షిండే వర్గంలోని సుమారు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌తో టచ్‌లో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఆసక్తి కరంగా మారాయి. అయితే గతంలో పార్టీని వీడిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తే వారిని ఉద్ధవ్, శరద్ పవార్‌లు తమ వర్గంలో చేర్చుకుంటారా లేదా అన్న అనుమానం నెలకొంది. మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారీగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వాలు సైతం మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, మహారాష్ట్రలో ఎన్డీయే ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే అమిత్ షా సూచనలతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. ఫడ్నవీస్ రాజీనామా చేస్తే బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్‌ను ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story