ద్రోహానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఎన్నికలు.. ఉద్ధవ్ థాక్రే

by vinod kumar |
ద్రోహానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఎన్నికలు.. ఉద్ధవ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ద్రోహానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమని శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత వసంత్ మోర్ మంగళవారం శివసేన(యూబీటీ)లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్ధవ్ ప్రసంగించారు. రాష్ట్రంలో త్వరలోనే అధికార మార్పు జరగనుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరిగితే, అసెంబ్లీ ఎన్నికలు ద్రోహానికి, నిస్సహాయతకు వ్యతిరేకంగా జరగనున్నాయని తెల్లడించారు. పూణే నగరం రాష్ట్రంలో అధికార మార్పిడికి కేంద్రంగా మారాలని సూచించారు. కాగా, వసంత్ మోరే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పూణే స్థానం నుంచి వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శివసేనలో చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌లో జరగనున్నాయి.

Advertisement

Next Story