డిజైనర్‌పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య కేసు

by sudharani |   ( Updated:2023-03-16 11:26:06.0  )
డిజైనర్‌పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య కేసు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఓ డిజైనర్‌ తనను బ్లాక్‌ మెయిల్ చేసేందుకు యత్నించారంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిక్ష అనే మహిళ తనను బెదిరిస్తోందని, బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు యత్నిస్తోందని డిజైనర్‌పై, ఆమె తండ్రిపై ఫిబ్రవరి 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తండ్రికి సంబంధించిన క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవడానికి రూ. 1 కోటి ఇవ్వడానికి ప్రయత్నించిందని కూడా చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

‘2021 నవంబర్‌లో తానొక డిజైనర్‌ని పరిచయం చేసుకుంది. కార్యక్రమాల్లో తాను డిజైన్ చేసిన దుస్తులు, ఆభరణాలు ధరించాలని, దాని వల్ల తన ప్రాడక్ట్స్‌కు ప్రచారం లభిస్తుందని తెలిపింది. మొదటి పరిచయంలోనే డిజైనర్ తన కుటుంబ విషయాలు వెల్లడించింది. మరోసారి కలిసినప్పుడు తన తండ్రికి పలు రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలున్నాయని చెప్పింది. మరోసారి నా సిబ్బంది ద్వారా చేతిరాతతో ఉన్న ఓ నోట్ అందించింది. తర్వాత ఓ రోజు నా భద్రతా సిబ్బందిని ఏమార్చి కారులో కూర్చుని, బుకీస్‌ గురించి తన తండ్రి పోలీసులకు సమాచారం ఇస్తాడని, దాంతో ఎలా డబ్బు సంపాదించవచ్చో చెప్పింది. ఫిబ్రవరి 16న ఫోన్‌ చేసి తన తండ్రి కేసు గురించి చెప్పి, అతడిని కేసు నుంచి బయటపడేస్తే.. రూ.కోటి ఇస్తానని మాట్లాడింది’ అంటూ అమృతా ఫడ్నవీస్ ఫిర్యాదులో పేర్కొంది. అమృత ఫిర్యాదు మేరకు అనిక్ష, ఆమె తండ్రిపై కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతామని గురువారం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed