Eknath Shinde : దేశం అరుదైన రత్నాన్ని కోల్పోయింది : మహారాష్ట్ర సీఎం

by Rani Yarlagadda |
Eknath Shinde : దేశం అరుదైన రత్నాన్ని కోల్పోయింది : మహారాష్ట్ర సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: రతన్ టాటా లేరన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే. టాటా చేస్తున్న పనుల ద్వారా అనేకమంది ప్రేరణ పొందారన్న ఆయన.. రతన్ టాటాను అరుదైన రత్నంతో పోల్చారు. దేశం అరుదైన రత్నం వంటి వ్యక్తిని కోల్పోయిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయనొక లెజెండ్ అని, మానసిక దృఢత్వంతో టాటా గ్రూప్ ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. ప్రభుత్వ లాంఛనాలతో టాటా అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు.

భారతదేశానికి గర్వకారణమైన టాటా.. తర్వాతి తరం పారిశ్రామికవేత్తలకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. రతన్ టాటా తన నైపుణ్యంతో ఎన్నో అంతర్జాతీయ కంపెనీలను స్వాధీనం చేసుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని తెలిపారు. ఇన్ఫరేషన్ టెక్నాలజీ కొత్తరంగంలో బలమైన నాయకత్వాన్ని వహించారన్నారు. ముఖ్యంగా యువతను ప్రోత్సహించడంలో నిరంతరం కృషి చేసిన గొప్ప పారిశ్రామిక వేత్త అని కితాబిచ్చారు.

రతన్ టాటా 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి.. ఆయన హయాంలో టాటా సంస్థను విస్తరింపజేశారు. కార్ల తయారీ రంగంలో టెల్కోను తీసుకురావడం, సమాచార సాంకేతిక రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ను స్థాపించారని తెలిపారు. ఆ తర్వాత టాటా కెమికల్స్, టాటా టీ, టాటా స్టీల్ వంటి కంపెనీలతో పారిశ్రామికరంగం తిరుగులేని పారిశ్రామిక వేత్తగా ఎదిగారని తెలిపారు. 2012లో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి పదవీ విరమణ చేసినా, వివిధ పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించారు. 2008 ముంబై దాడుల తర్వాత ఆయన చూపిన దృఢ సంకల్పాన్ని అందరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అతని దృఢమైన నిర్ణయాలు, సాహసోపేత వైఖరి మరియు సామాజిక నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఏక్ నాథ్ షిండ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Advertisement

Next Story