Maharashtra Assembly Elections: ‘మహా’ సమరం.. ఈ పార్టీలకు చావో రేవో

by Mahesh Kanagandla |
Maharashtra Assembly Elections: ‘మహా’ సమరం.. ఈ పార్టీలకు చావో రేవో
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra Assembly Elections 2024) ఈ సారి మరింత రసవత్తరంగా ఉండనున్నాయి. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత గడిచిన 30 ఏళ్లల్లో జరిగిన ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ సొంతంగా మెజార్టీ సాధించలేదు. ఫలితంగా పొత్తులు, కూటమి ప్రభుత్వాలు మహారాష్ట్రలో కొలువుదీరుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవిభాజ్య శివసేన, కాంగ్రెస్, అవిభాజ్య ఎన్సీపీల మహావికాస్ అఘాడీ(Maha Vikas Aghadi Alliance) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. రెండున్నరేళ్లలోనే అది కూలి బీజేపీ, ఏక్‌నాథ్ శిండే(Eknath Shinde) సారథ్యంలోని శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల మహాయుతి(Mahayuti Alliance) ప్రభుత్వం ఏర్పడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వమే కొలువుదీరనుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరగ్గా 23వ తేదీన ఫలితాలు వస్తాయి.

148 సీట్లల్లో బీజేపీ పోటీ:

మహాయుతి కూటమిలోని బీజేపీ 148 సీట్లలో పోటీ చేస్తుండగా, ఏక్‌నాథ్ సిండే సారథ్యంలోని శివసేన 80 సీట్లల్లో, అజిత్ పవార్ ఎన్సీపీ 53 అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ పార్టీ 102 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఉద్ధశ్ ఠాక్రే శివసేన 94 సీట్లల్లో, శరద్ పవార్(Sharad Pawar) ఎన్సీపీ 88 స్థానాల్లో అభ్యర్థులను దింపింది. మిగిలిన సీట్లను ఎస్పీ, సీపీఎం వంటి మిత్రపక్షాలకు కేటాయించింది. 76 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నేరుగా ఢీకొంటున్నారు. 145 సీట్లు మెజార్టీ మార్క్.

ఫ్లాష్‌బ్యాక్:

2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పొత్తులో పోటీ చేశాయి. బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. కానీ, సీఎం సీటు వివాదమై శివసేన బీజేపీకి గుడ్ బై చెప్పింది. శరద్ పవార్ చక్రం తిప్పి శివసేన, కాంగ్రెస్‌లను ఒకతాటి మీదికి తెచ్చాడు. ఫలితంగా ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, రెండున్నరేళ్ల తర్వాత ఏక్‌నాథ్ షిండే 39 మంది తోటి ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపాడు. 2022 జూన్‌లో ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) సీఎం పదవికి రాజీనామా చేయగా షిండే సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. 2023 జులైలో శరద్ పవార్‌కు ఝలక్ ఇస్తూ సోదరుడి కొడుకు అజిత్ పవార్ మెజార్టీ పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని షిండడే ప్రభుత్వంలో కలిశారు. సీఎంగా షిండే, డిప్యూటీలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు కొనసాగారు. శివసేన పార్టీ పేరును, ధనుస్సు గుర్తును షిండే వర్గం దక్కించుకోగా.. ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీగా, కాగడ గుర్తును ఎంచుకుంది. అజిత్ పవార్ కూడా ఎన్సీపీ పేరును, గడియారం గుర్తును దక్కించుకోగా.. శరద్ పవార్ వర్గం ఎన్సీపీ(శరత్ చంద్రపవార్)పార్టీగా సర్దుకుంది.

డూ ఆర్ డై పాలిటిక్స్:

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మహారాష్ట్రలో మంచి పట్టే ఉన్నా.. స్థానిక పార్టీలు లేకుండా అధికారాన్ని అందుకోలేవు. నిలువున చీలిన శివసేన, ఎన్సీపీ రెండు వర్గాలకు మనుగడ సాధించడానికి అధికారం అనివార్యమవుతున్నది. మహాయుతి కూటమి గెలిస్తే షిండే, అజిత్ పవార్‌ల పార్టీలకు ఢోకా ఉండదు. కానీ, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఆదరణ చాలా వరకు తగ్గిపోయే చాన్స్ ఉంది. ఆ తర్వాత సీఎం సీటు కోసం ఆశపడే పరిస్థితులు ఉండకపోవచ్చు. శరద్ పవార్ ఎప్పట్లాగే తన ఉనికిని తరుచూ చాటుతూ ఉండొచ్చు. అదే మహావికాస్ అఘాడీ కూటమి వస్తే షిండే, అజిత్ పవార్‌ల పార్టీల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికలు చీలిన రెండు పార్టీల నాలుగు వర్గాలకు చావో రేవో తేల్చుకునే సమరం వంటివని విశ్లేషిస్తున్నారు. షిండే, అజిత్ పవార్‌లు శాయశక్తుల గెలుపునకు పని చేస్తుంటే.. పార్టీ చీలిన సింపథీ ఉద్ధవ్, శరద్ పవార్‌లకు కలిసివచ్చే అవకాశం ఉన్నది.

గత ఫలితాలెలా ఉన్నాయి?

గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. యూపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు(48)న్న మహారాష్ట్రలో కాంగ్రెస్ 13, శివసేన (యూబీటీ) 9, ఎన్సీపీ(ఎస్‌పీ) 8 సీట్లు గెలుచుకున్నాయి. అదే బీజేపీ 9, షిండే శివసేన 7, అజిత్ పవార్ ఎన్సీపీ 1 సీటును గెలుచుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. అదే 2014లో బీజేపీ 122 సీట్లు గెలిచింది. ఇది బీజేపీ ప్రభావం తగ్గుతున్నదన్న సంకేతాన్ని ఇస్తున్నా.. హర్యానా ఎన్నికల మ్యాజిక్‌ ఆ పార్టీకి మానసిక బలాన్ని ఇస్తున్నది.

2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం(42/44) పెద్దగా మారలేదు. కానీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి మంచి ప్రదర్శన(కాంగ్రెస్ 13, ఠాక్రే సేన 9, శరద్ పవార్ ఎన్సీపీ 8.. మొత్తం 30 సీట్లు గెలుచుకుంది) కనబరిచింది. ఇది పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఎన్డీయేపై ప్రజల వ్యతిరేకతను ఇది సూచిస్తున్నదని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహావికాస్ అఘాడీకి మంచి సీట్లు దక్కుతాయని ఈ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Advertisement

Next Story