9 ఏళ్ళ మోడీ పాలనపై.. కాంగ్రెస్ 9 ప్రశ్నాస్త్రాలు

by Vinod kumar |
9 ఏళ్ళ మోడీ పాలనపై.. కాంగ్రెస్ 9 ప్రశ్నాస్త్రాలు
X

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిని చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న మే 26వ తేదీని 'మాఫీ దివస్'గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతుల ఆదాయం వంటి అంశాలపై 9 ప్రశ్నలను కాంగ్రెస్ పార్టీ సంధించింది. గత 9 ఏళ్లలో దేశ ప్రజలకు జరిగిన “ద్రోహానికి”.. ఈనెల 28న జరగబోయే పార్లమెంట్ ప్రారంభోత్సవాలలో క్షమాపణ చెప్పాలని ప్రధాని మోడీని డిమాండ్ చేసింది. భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లేవనెత్తిన అంశాల్లో భాగమే ఈ తొమ్మిది ప్రశ్నలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్‌ ఇంచార్జి జైరాం రమేష్‌ అన్నారు.

శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సర్కారు వైఫల్యాలపై తొమ్మిది ప్రశ్నలతో "నౌ సాల్.. నౌ సవాల్" శీర్షికన ప్రచురించిన బుక్ లెట్ ను జైరాం రమేష్‌, పార్టీ నేతలు పవన్ ఖేరా, సుప్రియా శ్రినేట్‌ విడుదల చేశారు. ఈ ప్రశ్నలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. తన మిత్రుడు అదానీకి ప్రయోజనం చేకూర్చడానికి ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలలో ప్రజలు పొదుపు చేసిన డబ్బును ప్రధాని ఎందుకు పణంగా పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. 2020లో చైనాకు ప్రధాని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా.. భారత భూభాగాన్ని ఆక్రమించుకునే వ్యవహారాన్ని ఆ దేశం ఎందుకు ఆపలేదన్నారు. " ప్రతిపక్ష పార్టీలు, నేతలపై ఎందుకు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ధనబలాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు" అని అడిగారు.

Advertisement

Next Story