రేపే ఎన్నికల షెడ్యూల్ : లోక్‌సభతో పాటు ఆ నాలుగు రాష్ట్రాలకూ పోల్స్

by Hajipasha |
రేపే ఎన్నికల షెడ్యూల్ : లోక్‌సభతో పాటు ఆ నాలుగు రాష్ట్రాలకూ పోల్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నగారా శనివారం (మార్చి 16న) మధ్యాహ్నం 3 గంటలకు మోగనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ప్రెస్‌‌మీట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈవివరాలను భారత ఎన్నికల సంఘం ప్రతినిధి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్‌ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 16తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవల ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం టీమ్.. రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. ఆ సమాచారం ఆధారంగా రెడీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌నే శనివారం ప్రకటించనుంది. గత లోక్‌సభ ఎన్నికలను ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో నిర్వహించారు. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను అనౌన్స్ చేశారు. ఈసారి కూడా ఏప్రిల్‌ - మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రేపు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘంలోనూ కమిషనర్ల ఖాళీలు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం సీఈసీ రాజీవ్ కుమార్ తో సహా మొత్తం ముగ్గురు సభ్యులు ఉన్నారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న ఏకైక ప్రతిబంధకం తొలగినట్లు అయింది. ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడానికి మార్గం సుగమం అయింది.

Advertisement

Next Story