‘ఫినిషర్’ : రాహుల్ గాంధీని ధోనీతో పోల్చిన రాజ్‌నాథ్

by Hajipasha |
‘ఫినిషర్’ : రాహుల్ గాంధీని ధోనీతో పోల్చిన రాజ్‌నాథ్
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సెటైర్స్ వేశారు. ‘‘క్రికెట్‌లో మహేంద్ర‌సింగ్ ధోనీ ఎలాంటి గొప్ప ఫినిషరో.. కాంగ్రెస్ కోసం రాహుల్ గాంధీ అలాంటి గొప్ప ‘ఫినిషర్’.. ఆ పార్టీని పూర్తి పతనం దిశగా రాహుల్ నడిపిస్తున్నారు’’ అని ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడంతో.. ప్రస్తుతం దేశంలోని రెండు లేదా మూడు చిన్న రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరు? అని ఆయన సభకు హాజరైన ప్రజలను అడిగారు. అక్కడున్న వారంతా ధోనీ అని బదులిచ్చారు. వారి సమాధానాన్ని ఉద్దేశించి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘‘భారత రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్ ఎవరు ? అని ఎవరైనా నన్ను అడిగితే రాహుల్ గాంధీ పేరే చెబుతాను. చాలా మంది నాయకులు కాంగ్రెస్‌ను వీడడానికి రాహులే కారణం’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని పూర్తిగా కనుమరుగు చేసే వరకు ఆగనని ప్రతిజ్ఞ చేసినట్టుగా రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్‌కు అవినీతితో విడదీయరాని సంబంధం ఉంది. అవినీతితో కాంగ్రెస్ సంబంధాన్ని సల్మాన్ ఖాన్ నటించిన “మైనే ప్యార్ కియా” మూవీలోని “తూ చల్ మై ఆయా” పాటతో పోల్చొచ్చు’’ అని రాజ్‌నాథ్ తెలిపారు.

Advertisement

Next Story