ఇక కోర్టులోనే తేల్చుకుంటాం: రెజ్లర్లు

by Mahesh |   ( Updated:2023-06-26 03:26:32.0  )
ఇక కోర్టులోనే తేల్చుకుంటాం: రెజ్లర్లు
X

న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పోరాటాన్ని ఇకపై కోర్టులో నిర్వహిస్తామని అగ్రశ్రేణి రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా స్పష్టం చేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మా డిమాండ్లను అమలు చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాత ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై చార్జిషీట్ నమోదు చేశారు.

ఇప్పుడు, మా పోరాటం రోడ్లపై కాదు.. కోర్టులో కొనసాగుతుంది. డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జూలై 11న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. హామీ అమలు కోసం వేచి చూస్తాం.’ అని రెజ్లర్లు పేర్కొన్నారు. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చాలా రోజులపాటు నిరసన చేపట్టిన రెజ్లర్లు.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీతో తాత్కాలికంగా నిరసనలను విరమించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed