పేపర్ లీక్‌లు, ఎగ్జామ్ ఛీటింగ్‌లకు చెక్.. లోక్‌సభ‌లోకి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్’ బిల్లు

by Hajipasha |
పేపర్ లీక్‌లు, ఎగ్జామ్ ఛీటింగ్‌లకు చెక్.. లోక్‌సభ‌లోకి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్’ బిల్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : పోటీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్‌లను నిరోధించడానికి ఉద్దేశించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ మార్గాల నివారణ) బిల్లు -2024’ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ దీన్ని సభ ఎదుట ప్రజెంట్ చేశారు. ఈ బిల్లును ఎలాగైన ఈ సెషన్‌లో ఆమోదించాలనే పట్టుదలతో మోడీ సర్కారు ఉంది. తద్వారా పోటీ పరీక్షల్లో ప్రతిభావంతులైన ఉద్యోగార్ధులకు అన్యాయం జరగకుండా చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే విద్యావంతులైన యువ ఓటర్లు తమవైపు ఆకర్షితులవుతారని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆశిస్తోంది. ఈనేపథ్యంలో సర్వత్రా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ మార్గాల నివారణ) బిల్లు -2024’పై చర్చ జరుగుతోంది. అందులోని ప్రతిపాదిత అంశాలపై డిస్కషన్ నడుస్తోంది. యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ, రైల్వేస్, నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదంతో చట్టరూపాన్ని దాలిస్తే.. పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలే వారికి కనీసం మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. పేపర్ లీక్ వ్యవహారాల్లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి ఐదు నుంచి పదేళ్ల జైలుశిక్ష విధించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.

సర్వీస్ ప్రొవైడర్ సంస్థల నేరం నిరూపితమైతే రూ.కోటి జరిమానా

పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసినట్లు తేలితే వాటికి రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునంతా సంస్థ నుంచి రికవర్ చేయాలనే ప్రతిపాదనను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. ఇలాంటి సంస్థపై పరీక్షలు నిర్వహించకుండా నాలుగేళ్ల పాటు బ్యాన్‌ను కూడా విధించాలని ప్రపోజ్ చేశారు. స్థూలంగా ఈ బిల్లులో పేపర్ లీక్‌తో ముడిపడిన 20 రకాల నేరాలు, అక్రమాలకు పాల్పడే వారికి విధించాల్సిన శిక్షల గురించి ప్రస్తావించారు. మాస్ కాపీయింగ్, జవాబు పత్రాలను తారుమారు చేయడం, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం వంటివన్నీ ఈ నేరాల జాబితాలో ఉన్నాయి. పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి నిర్వహించాల్సి ఉంటుంది. దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి అప్పగించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed