బ్యాడ్మింటన్ ఆడుతున్న లాలూకు బెయిల్ ఎందుకు?

by Vinod kumar |
బ్యాడ్మింటన్ ఆడుతున్న లాలూకు బెయిల్ ఎందుకు?
X

న్యూఢిల్లీ : ఓ వైపు బ్యాడ్మింటన్‌ ఆడుతూ.. మరోవైపు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం ఏముందని సుప్రీంకోర్టులో సీబీఐ వాదించింది. ఇటీవల లాలూ బ్యాడ్మింటన్‌ ఆడిన వీడియోలు వైరల్‌ అయ్యాయని, ఒకవేళ ఆయనకు అనారోగ్య సమస్యలుంటే బ్యాడ్మింటన్‌ ఎలా ఆడగలుగుతారని సీబీఐ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. 1996లో చోటుచేసుకున్న రూ.950 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూకు మంజూరైన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.

లాలూ తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. లాలూ ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్నారని, అనారోగ్యంతో ఉన్న ఆయనను తిరిగి జైల్లోకి పంపేందుకు సీబీఐ కుట్ర చేస్తోందని వాదించారు. జైలు శిక్షను తప్పించుకునేందుకు లాలూ యత్నిస్తున్నారని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టును సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా లాలూ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 17కి వాయిదా వేసింది.

Advertisement

Next Story