AIIMS : సుప్రీంకోర్టు పిలుపు.. సమ్మెను ఆపిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు

by Hajipasha |
AIIMS : సుప్రీంకోర్టు పిలుపు..  సమ్మెను ఆపిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్‌డీఏ) నిర్వహిస్తున్న సమ్మె ఆగింది. వైద్యులు నిరసనలు ఆపి విధుల్లో చేరాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ సమ్మెను విరమించాలని ఢిల్లీ ఎయిమ్స్ ఆర్‌డీఏ నిర్ణయించింది. దీంతో ఎట్టకేలకు 11వ రోజున సమ్మెను ఆపివేశారు. వైద్యులు ఇక తమతమ విధుల్లోకి చేరుతారని ఢిల్లీ ఎయిమ్స్ ఆర్‌డీఏ ప్రకటించింది. కోల్‌కతా మెడికల్ కాలేజీ కేసును సుమోటోగా స్వీకరించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపింది.

దేశంలోని వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల భద్రతపై జాతీయస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడాన్ని గొప్ప నిర్ణయంగా అభివర్ణించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికార వర్గాలను ఢిల్లీ ఎయిమ్స్ ఆర్‌డీఏ కోరింది. రోగుల భద్రతే తమకు పరమావధి అని, దానిపై ఇక పూర్తిస్థాయి ఫోకస్ చేస్తామని వెల్లడించింది. అయితే ప్రతిరోజూ పనిగంటలు ముగిసిన తర్వాత తాము కోల్‌కతా జూనియర్ వైద్యురాలికి సంఘీభావంగా నిరసన తెలుపుతామని స్పష్టం చేసింది. ఆమెకు న్యాయం జరిగే వరకు ఈ తరహా నిరసనలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది.

Advertisement

Next Story