Kolkata rape-murder: హత్యాచారం కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్‌

by Shamantha N |   ( Updated:2024-08-23 09:49:12.0  )
Kolkata rape-murder: హత్యాచారం కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా మహిళా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోర్టు 14రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. సీబీఐ కస్టడీ శుక్రవారంతో ముగియడంతో నిందితున్ని కట్టుదిట్టమైన భద్రత నడుమ సీల్దా కోర్టులో హాజరుపరిచారు. దీంతో, కోర్టు నిందితుడ్ని 14 రోజుల రిమాండ్ కు పంపింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు. ఇకపోతే, కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి అనుమతినిచ్చింది. పాలిగ్రాఫ్ పరీక్షను కోర్టు ఆధారంగా తీసుకోదు. కానీ, నేర పరిశోధన కోసం అది అవసరమయ్యే అవకాశం మాత్రం ఉంటుంది.

మరో ముగ్గురికి పాలిగ్రాఫ్ పరీక్షలు

ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్ సెమినార్ గదిలో వేలిముద్రలు లభించిన ఇద్దరు ప్రథమ సంవత్సరం పీజీటీ వైద్యులకు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఘటన జరిగిన రోజు రాత్రి బాధితురాలితో ఆ ఇద్దరు ట్రైనీ డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు. సెమినార్ హాల్ కు వెళ్లే ముందూ అందరూ కలిసి డిన్నర్ చేశారు. అలానే హాస్పిటల్ లో ఉన్న మరో సిబ్బందికి కూడా పాలిగ్రాఫ్ పరీక్ష చేపట్టనున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో బాధితురాలితో మాట్లాడిన వ్యక్తికి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, వీరందరికీ నేరంతో సంబంధం లేకపోయినప్పటికీ.. సాక్ష్యాలు తారుమారు చేయండతో ఏదైనా పాత్ర పోషించారా లేదా అనే విషయంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. హత్య కుట్రలో ఏదైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణజరుపుతోంది. ఆగస్టు 9న కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం జరిగింది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed