CBI : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. రెండో రోజు సీబీఐ విచారణ ఇలా..

by Hajipasha |
CBI : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. రెండో రోజు సీబీఐ విచారణ ఇలా..
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను వరుసగా రెండోరోజు సీబీఐ ప్రశ్నించింది. కోల్‌కతాలోని సీబీఐ ఆఫీసులో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయనను సీబీఐ అధికారులు ఇంటరాగేట్ చేశారు. అంతకుముందు రోజు (శుక్రవారం) రాత్రి 9.30 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు సందీప్ ఘోష్‌ను విచారించారు. సీబీఐ అధికారులు వేసిన ప్రశ్నలకు ఆయన చెప్పిన కొన్ని సమాధానాలు అర్థవంతంగా లేకపోవడం వల్లే రెండోరోజు కూడా పిలిచి ప్రశ్నించినట్లు తెలిసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు చెందిన వీక్లీ రోస్టర్ గురించి, దురాగతానికి బలైన జూనియర్ వైద్యురాలి డ్యూటీ షిఫ్టుల వివరాలపై సందీప్‌ ఘోష్‌కు పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన జరిగిన అనంతరం సీబీఐ ఆదేశాలతో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పదవికి ఆయన రాజీనామా చేశారు.

ఆ రోజు డ్యూటీ చేసిన వారందరినీ విచారించాలి

ఆగస్టు 8న రాత్రి జూనియర్ వైద్యురాలితో పాటు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో డ్యూటీ చేసిన వారందరినీ విచారించాలని ఆ ఆస్పత్రికి చెందిన పీజీ టీచర్ డాక్టర్ ఆరిఫ్ అహ్మద్ లస్కర్ డిమాండ్ చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అరెస్టు చేయాలని కోరారు. కేసు విచారణలో ఉన్నందున కాలేజీకి సంబంధించిన అధికారులంతా రాజీనామా చేయాలన్నారు.

ఢాకా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ బంగ్లాదేశ్‌లోని ఢాకా యూనివర్సిటీలో వైద్య విద్యార్థులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు నినాదాలు చేస్తూ కోల్‌కతా ఘటనను ఖండించారు. ‘‘మహిళలారా గొంతు విప్పండి’’, ‘‘రేపిస్టులను ఉరితీయండి’’, ‘‘తర్వాత నేనేనా ?’’, ‘‘హింసను ఆపండి’’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

యూకేలోని భారతీయ డాక్టర్ల ఓపెన్ లెటర్

కోల్‌కతా ఘటనపై యూకేలోని భారతీయ డాక్టర్లు కూడా స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ వారు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘‘మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఈ కష్టకాలంలో డాక్టర్లకు అండగా నిలవాలి. కానీ మమతా బెనర్జీ సహా చాలామంది నాయకులు బాధితులనే కించపరిచేందుకు సిద్ధపడుతున్నారు. ఈ వైఖరి సరికాదు’’ అని లేఖలో పేర్కొన్నారు.

పిస్టోల్‌ను చూపిస్తూ ప్రసంగించిన డాక్టర్‌పై కేసు

కోల్‌కతా ఘటనకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని అమ్రేలీ నగరంలో వైద్యులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జీజే గజేరా అనే డాక్టర్ తన లైసెన్సుడ్ తుపాకీని బహిరంగంగా చూపించారు. ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళనలు కలిగాయంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

టీఎంసీ అంటే తాలిబన్ ముఝే చాహియే : షెహజాద్ పూనావాలా

టీఎంసీ పార్టీపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా విరుచుకుపడ్డారు. ‘‘జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి తెగబడిన వారిని శిక్షించాలని యావత్ దేశం కోరుతోంది. కానీ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు ఆ దురాగతానికి తెగబడిన వారిని కాపాడటంలో బిజీగా ఉంది. అందుకే టీఎంసీ అనేది తాలిబన్ ముఝే చాహియే అనే పర్యాయపదాన్ని సొంతం చేసుకుంది’’ అని ఆయన విమర్శించారు.

Advertisement

Next Story