J&K Election: రేపు జమ్మూ, శ్రీనగర్‌లో పర్యటించనున్న ఖర్గే, రాహుల్

by Harish |   ( Updated:2024-08-20 09:49:45.0  )
J&K Election: రేపు జమ్మూ, శ్రీనగర్‌లో పర్యటించనున్న ఖర్గే, రాహుల్
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తన స్పీడ్‌ను పెంచింది. అక్కడ ఎలాగైనా బీజేపీని అడ్డుకోడానికి తన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆగస్టు 21, 22 తేదీల్లో జమ్మూ, శ్రీనగర్‌లో పర్యటించి కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ కూడా వీరి పర్యటనను ధృవీకరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా రెండు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో వారు పర్యటిస్తారని మీర్ చెప్పారు.

ఖర్గే, రాహుల్‌ బుధవారం మధ్యాహ్నం జమ్మూ చేరుకుంటారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల గురించి చర్చించి వారికి దిశానిర్ధేశం చేస్తారు. తరువాత అదే రోజు సాయంత్రం శ్రీనగర్‌కు చేరుకుని గురువారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. తమ పర్యటన సందర్భంగా ఖర్గే, గాంధీ జమ్మూ, శ్రీనగర్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీని శక్తివంతం చేసేందుకు, బలోపేతం చేసేందుకు విస్తృత సమావేశాలు నిర్వహిస్తారని గులాం అహ్మద్ మీర్ పేర్కొన్నారు. కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్‌లో భాజపా అధికారంలోకి రాకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని అన్నారు. 90 మంది సభ్యులున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story