ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై రాడ్లతో దాడి..

by Vinod kumar |
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై రాడ్లతో దాడి..
X

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఖలిస్తానీ మద్దతుదారులు దారుణానికి తెగబడ్డారు. ఖలిస్థానీ వేర్పాటువాదులు తనపై దాడికి పాల్పడ్డారని.. భారత్‌కు చెందిన ఓ విద్యార్థి వెల్లడించాడు. వెస్టర్న్ సిడ్నీలోని వెస్ట్‌మేడ్ ప్రాంతంలో దాదాపు 7, 8 మంది ఖలిస్థానీ మూక తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిందని పేర్కొన్నాడు. తనను కొడుతున్న సమయంలో వారు "ఖలిస్థాన్ జిందాబాద్" నినాదాలు చేశారని చెప్పాడు. ఖలిస్థాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారన్నాడు. ఇనుప రాడ్లతో తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చదువుకుంటూ పార్ట్‌టైమ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు.

శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 5 గంటల 30 నిమిషాలకు తాను వెళ్లి కారు డ్రైవింగ్ సీటులో కూర్చోగానే 8 మంది మూకలు వచ్చి దాడికి దిగారని వివరించాడు. తనను కారులో నుంచి కిందికి లాగి పడేసి ఇనుప రాడ్లతో మొహంపై కొట్టారని వాపోయాడు. ఎడమ కంటి కింది భాగంలో ఇనుప రాడ్‌తో కొట్టడంతో తీవ్ర గాయమైనట్లు చెప్పాడు. నలుగురైదుగురు తనను కొడుతుంటే మరో ఇద్దరు, ముగ్గురు సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారని తెలిపాడు. తనపై జరిగిన దాడిని స్థానికులంతా చూశారని, వెంటనే పోలీసులు వచ్చి తనను హాస్పిటల్‌కు తరలించారని తెలిపాడు. బాధిత విద్యార్ధి తల, కాలు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed