బిహార్‌లో కీలక పరిణామం: భారీగా బ్యూరోక్రాట్ల బదిలీలు

by samatah |
బిహార్‌లో కీలక పరిణామం: భారీగా బ్యూరోక్రాట్ల బదిలీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి ఎన్డీయే గూటికి చేరబోతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారీగా అధికారులను బదిలీ చేశారు. 22 మంది ఐఏఎస్‌లు, 79 మంది ఐపీఎస్‌లు, 45 మంది బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. అందులో ఐదుగురు జిల్లా మేజిస్ట్రేట్లు, 17మంది ఎస్పీలు ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను సచివాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఐజీ (జైళ్లు)గా ఉన్న శిర్సత్ కపిల్ అశోక్ నియమితులయ్యారు. భాగల్‌పూర్ డీఎం సుబ్రత్ కుమార్ సేన్, ముజఫర్‌పూర్ డీఎంగా నియమించారు. అంతేగాక బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (బీఏఎస్)కు చెందిన 45 మంది అధికారులకు కూడా కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తరుణంలో అధికారుల బదిలీలు చర్చనీయాంశమయ్యాయి.

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం

బీజేపీ మద్దతులో నితీశ్ ఆదివారం మళ్లీ సీఎంగా ప్రమాణం చేస్తారని జాతీయ మీడియాతో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే రాష్ట్ర బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి నితీశ్‌తో పొత్తు వార్తలను కొట్టిపారేశారు. కేవలం లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరోవైపు, నితీశ్ కుమార్ సైతం శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేసేందుకే ఈ భేటీ నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story