Kerala : గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం కీలక నిర్ణయం.. పూజలకు తులసి ఆకుల స్వీకరణపై బ్రేక్

by Hajipasha |
Kerala : గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం కీలక నిర్ణయం.. పూజలకు తులసి ఆకుల స్వీకరణపై బ్రేక్
X

దిశ, నేషనల్ బ్యూరో : తులసి ఆకులతో శ్రీకృష్ణుడి ఆరాధన శ్రేష్ఠమైందని పెద్దలు చెబుతుంటారు. కేరళ(Kerala)లోని త్రిసూర్‌లో ఉన్న ప్రఖ్యాత గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం(Guruvayur Sree Krishna temple)లో నిత్యం భక్తులు తులసి ఆకులతో స్వామివారికి పూజలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు ఈ ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించడానికి తులసి ఆకులను స్వీకరించడం లేదు. తులసి(Tulsi) ఆకుల్లో పెద్ద మోతాదులో క్రిమిసంహారకాలు ఉన్నందు వల్ల, వాటిని తాకే ఆలయ సిబ్బందికి అలర్జీ, దురద, చర్మ సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. దీంతో స్వామివారి పూజల కోసం తులసి ఆకులను స్వీకరించకూడదని గురువాయూర్ ఆలయ కమిటీ నిర్ణయించింది.

దీన్ని పలు హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ నిర్ణయం ఉందని వాదిస్తున్నాయి. అయితే తమ నిర్ణయాన్ని గురువాయూర్ ఆలయ కమిటీ సమర్ధించుకుంటోంది. ‘‘మేం గత కొన్ని నెలలుగా తులసి ఆకులను పూజల కోసం స్వీకరించడం లేదు. ఇప్పుడు కొందరు దురుద్దేశంతో దీనిపై రాద్ధాంతం చేస్తున్నారు’’ అని కమిటీ తెలిపింది. ఆలయం పరిసరాల్లోని దుకాణాల్లో తులసి ఆకులను విక్రయిస్తుంటారని.. వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు క్రిమిసంహారకాలను చల్లుతుంటారని పేర్కొంది. క్రిమిసంహారకాలు చల్లని తులసి ఆకులను తామే ప్రత్యేక కౌంటరులో అమ్ముతున్నామని ఆలయ కమిటీ తెలిపింది.

Advertisement

Next Story