ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీఎం విజయన్ నుంచి నివేదిక కోరిన గవర్నర్

by Harish |   ( Updated:2024-09-29 14:40:00.0  )
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీఎం విజయన్ నుంచి నివేదిక కోరిన గవర్నర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మంత్రులు, జర్నలిస్ట్‌ల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేశారని ఇటీవల స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్‌ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నుంచి గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ వివరణ కోరారు. ఈ మేరకు గవర్నర్, సీఎంకు లేఖ రాశారు. ట్యాపింగ్ ఆరోపణలు చాలా తీవ్రమైన విషయం, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ఎలాంటి చట్టపరమైన అనుమతి లేకుండా ఫోన్ కాల్ సంభాషణలను రికార్డ్ చేయడం సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన క్రిందకు వస్తుంది. ట్యాపింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై దర్యాప్తు చేశారా.. ఒకవేళ చేసినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు.. మొదలగు అన్ని వివరాలు కూడా తెలియజేయాలని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే గతంలో, మంత్రులు, జర్నలిస్టుల ఫోన్‌ ట్యాపింగ్‌కు ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి పి.శశి, ఎడీజీపీ ఎంఆర్‌ అజిత్‌కుమార్‌లు పాల్పడ్డారని ఎమ్మెల్యే పీవీ అన్వర్‌ ఆరోపించారు. దీనిపై గతంలోనే స్పందించిన సీఎం విజయన్, అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతామని, విచారణ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story