Kerala Floods: వాయనాడ్‌ ప్రమాదంలో ప్రాణనష్టం 'ఘోర విషాదం': కేరళ గవర్నర్

by S Gopi |
Kerala Floods: వాయనాడ్‌ ప్రమాదంలో ప్రాణనష్టం ఘోర విషాదం: కేరళ గవర్నర్
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రం కేరళలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మది ఖాన్ బుధవారం మీడియాకు స్పందించారు. 'ఘటన గురించి తెలియగానే గుండె చెదిరిందని, ఈ ఘోర విషాదానికి రాష్ట్రం మాత్రమే కాదు యావత్తు దేశమే విచారంలో మునిగిపోయింది. అయితే, సంబంధిత జిల్లా యంత్రాంగం, ఎస్పీ, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి తక్షణ చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం ఎంతో సానుకూలం. సాయుధ బలగాలు సైతం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చేరుకునేందుకు 2 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు. ఈ పరిణామాలు కొంత ఊరట కలిగిస్తున్నాయని' జాతీయ మీడియా గవర్నర్ తెలిపారు. అంతకుముందు గవర్నర్ విమ్స్ ఆసుపత్రి, డా మూపెన్స్ మెడికల్ కాలేజీని సందర్శించి, క్షతగాత్రులైన వారి బంధువులతో పరామర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా ఉన్నారు. అలాగే, భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ రెస్క్యూ ఫోర్స్, కేరళ పోలీసులు, వాలంటీర్లు, ఇతరులు సంయుక్తంగా రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్న వాయనాడ్‌లోని చూరల్ మాలా ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించారు. కాగా, వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 160కి పెరిగిందని కేరళ రెవెన్యూ విభాగం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed