సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్..ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సవాల్

by vinod kumar |
సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్..ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో సోమవారమే విచారణ జరపాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ‘బెయిల్ రద్దు కోసం దరఖాస్తును నిర్ధారించడానికి అవసరమైన ప్రమాణాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి బెయిల్ మంజూరు ఆర్డర్ ఆదేశాలు ఒక్క రోజు కూడా కొనసాగలేవు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించడంలో హైకోర్టు అవలంబించిన విధానం న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధమని తెలిపారు.

ఈ నెల 20న కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి జస్టిస్ బిందు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అయితే దిగువ కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయాన్ని నిలిపివేసింది. బెయిల్ ఆర్డర్ పై మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ అత్యున్నత న్యాయాస్థానాన్ని ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed