ఏచూరితో కేజ్రీవాల్ భేటీ.. ఆర్డినెన్స్ విషయంలో ఆప్‌కు సీపీఎం మద్దతు

by Satheesh |
ఏచూరితో కేజ్రీవాల్ భేటీ.. ఆర్డినెన్స్ విషయంలో ఆప్‌కు సీపీఎం మద్దతు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత మరో పార్టీ అండగా నిలిచింది. ఢిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏచూరితో భేటీ అయి కేంద్రంపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీతారాం ఏచూరి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరలిజంపై దాడి చేస్తోందని ఆరోపించారు.

ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకువస్తే దానిని వ్యతిరేకిస్తూ తమ పార్టీ పార్లమెంట్‌లో ఆప్‌కు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు ఆప్‌కు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఏచూరి విజ్ఞప్తి చేశారు. అయితే ఆప్‌కు మద్దతు విషయంలో అధిష్టానం ఆలోచన చేయాలని ఢిల్లీ, పంజాబ్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. ఆప్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించవద్దని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏచూరి చేసిన విజ్ఞప్తి కాంగ్రెస్ అధిష్టానం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story