మేయర్ ఎన్నికకే ఇంత నీచానికి దిగజారాలా: బీజేపీపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు

by samatah |
మేయర్ ఎన్నికకే ఇంత నీచానికి దిగజారాలా: బీజేపీపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ప్రవర్తించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ విరుచుకు పడింది. ఇది ముమ్మటికీ దేశ ద్రోహమేనని ఆరోపించింది. ‘చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో నిజాయితీ లేని తీరు ఆందోళన కలిగిస్తోంది. పట్టపగలే మోసం జరిగింది. మేయర్ ఎన్నికల్లోనే ఇంత నీచానికి దిగజారితే.. దేశ పార్లమెంటు ఎన్నికల్లో ఎంతటి స్థాయికైనా దిగజారొచ్చు. ఇది చాలా ఆందోళనకరం’ అని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే పోలింగ్ అనంతరం మరో ఆప్ నేత రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడారు. ‘ఓటు చెల్లదు అని ప్రకటించినప్పుడు దానిని అన్ని పార్టీల ఏజెంట్లకు ప్రిసైండింగ్ అధికారి చూపించాలి. కానీ అలా జరగలేదు. మేయర్ ఎన్నికకే ఇలా చేస్తే.. లోక్ సభ ఎన్నికల్లో వారు ఏమి చేయగలరో’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. మరోవపై, మేయర్ ఎన్నికల్లో గెలుపొందినందుకు బీజేపీ చండీగఢ్ యూనిట్‌కు బీజేపీ చీఫ్ నడ్డా అభినందనలు తెలిపారు. చండీగఢ్‌లో మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ కంటే ఆప్- కాంగ్రెస్ కూటమికే ఎక్కువ ఓట్లు ఉండగా కాషాయ పార్టీనే గెలుపొందడం గమనార్హం.

Advertisement

Next Story