'క్రిస్మస్‌ గ్రీటింగ్స్ చెప్పేందుకే పిలిచారు'.. ఈడీ విచారణపై కార్తీ చిదంబరం సెటైర్స్

by Vinod kumar |
క్రిస్మస్‌ గ్రీటింగ్స్ చెప్పేందుకే పిలిచారు.. ఈడీ విచారణపై కార్తీ చిదంబరం సెటైర్స్
X

న్యూఢిల్లీ : ఈడీ తనను విచారణకు పిలవడం కొత్తేం కాదని.. క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పేందుకే ఈసారి పిలిచారని మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సెటైర్స్ వేశారు. 2011లో 263 మంది చైనీయులకు వీసాలను మంజూరు చేయించేందుకు రూ.50 లక్షల లంచాన్ని కార్తీ పుచ్చుకున్నారనే ఆరోపణలపై మనీలాండరింగ్‌ కేసును ఈడీ విచారణ జరుపుతోంది. దీనిపై సమన్లు జారీ కావడంతో కార్తీ చిదంబరం శనివారం ఢిల్లీలో ఈడీ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు ఆయన ఈడీ కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.

‘‘నన్ను విచారణకు పిలవడం ఈడీకి దినచర్యగా మారింది. అవే పాత ప్రశ్నలు.. అవే సమాధానాలు.. ప్రస్తుతం క్రిస్మస్‌ సమయం.. శుభాకాంక్షలు చెప్పేందుకే పిలిచి ఉంటారు’’ అని కార్తీ పేర్కొన్నారు. తాను ఈడీ విచారణకు హాజరుకావడం ఇది 20వసారి అని ఆయన చెప్పారు. వాస్తవానికి చైనీయులకు వీసాల జారీ కేసును సీబీఐ మూసివేందని.. అయినా ఆ కేసును ఈడీ తెరిచి తనను విచారిస్తోందని ఆరోపించారు. తన తరఫు న్యాయవాదులు ఇప్పటికే వంద పేజీల లేఖను ఈడీకి అందించారని వెల్లడించారు. ‘‘ఇది ఫేక్‌ కేసు..ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనేది నాకు తెలియదు. అది ఏదో చైనీస్‌ దెయ్యం అయి ఉండాలి’’ అని కార్తీ కామెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed