Karnataka: SBI, PNBలో లావాదేవీలను ఆపేయండి.. ప్రభుత్వం ఆదేశం

by Harish |
Karnataka: SBI, PNBలో లావాదేవీలను ఆపేయండి.. ప్రభుత్వం ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులలో ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించకూడదని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చేలా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, కార్పొరేషన్‌లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు వెంటనే ఈ రెండు బ్యాంకులలో ఖాతాలను తక్షణమే రద్దు చేయాలి, అలాగే, ఈ బ్యాంకుల్లో తదుపరి డిపాజిట్లు గానీ పెట్టుబడులు పెట్టడం కానీ చేయకూడదని సీఎం సిద్దరామయ్య ఆమోదించిన ఉత్తర్వును ఆర్థిక కార్యదర్శి బుధవారం జారీ చేశారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌‌లో అక్రమాలు వెలుగుచూశాయి. వీటి నిధులను ఇతర ఖాతాల్లోకి దారి మళ్లించారు. సహకార బ్యాంకు ఖాతాల్లోకి రూ.88.62 కోట్లను బదిలీ చేయడంతో పాటు కార్పొరేషన్‌ నిధుల్లో రూ.187 కోట్లకు సంబంధించిన అనధికార లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. దీనిలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం తన ఖాతాలను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చింది. కార్పొరేషన్‌కు చెందిన కుంభకోణంపై ఇటు బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షం, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.

Advertisement

Next Story