డీకేపై సీబీఐ దర్యాప్తు ఉపసంహరణకు కేబినెట్ నిర్ణయం.. భగ్గుమన్న విపక్షాలు

by Vinod kumar |
డీకేపై సీబీఐ దర్యాప్తు ఉపసంహరణకు కేబినెట్ నిర్ణయం.. భగ్గుమన్న విపక్షాలు
X

బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌‌పై సీబీఐ జరుపుతున్న దర్యాప్తును ఉపసంహరించుకుంటూ రాష్ట్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే శివకుమార్‌ కేసును ఆనాడు సీబీఐకి అప్పగించిందని పేర్కొంది. ‘‘సాధారణంగా ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల విచారణకు స్పీకర్‌, మంత్రులపై సీబీఐ కేసుల విచారణకు గవర్నర్‌ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న డీకే కేసులో గవర్నర్‌ మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పీకర్‌ పర్మిషన్‌ ఇవ్వలేదు. ఆ అనుమతి అక్రమం’’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నాటి సీఎం యడ్యూరప్ప మౌఖిక ఆదేశాల మేరకు డీకే శివకుమార్‌పై సీబీఐ విచారణకు గవర్నర్ ఇచ్చిన పర్మిషన్ చెల్లదన్నారు.

అయితే డీకే అక్రమాస్తుల కేసులో గత ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన అనుమతిపై ప్రస్తుతం హైకోర్టులో ఉన్న కేసు గురించి తాను మాట్లాడనని ఆయన చెప్పారు. కాగా, 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా డీకే పనిచేశారు. ఈ టర్ములో ఆయన అక్రమంగా 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకుంటూ కర్ణాటక మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం గురించి తనకు తెలియదని డీకే చెప్పారు. వార్తా పత్రికల్లోనే ఈ విషయం చూశానన్నారు. కాగా, అక్రమాస్తుల కేసులో గత బీజేపీ ప్రభుత్వం సీబీఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ డీకే శివకుమార్ వేసిన పిటిషన్‌పై విచారణను కర్ణాటక హైకోర్టు నవంబర్ 29కి వాయిదా వేసింది.

బందిపోటులను రక్షిస్తున్నారు : జేడీఎస్

డీకే శివకుమార్‌పై సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకుంటూ కర్ణాటక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. లీగల్ ప్రక్రియపై నమ్మకం ఉంచాలే కానీ, ఇలాంటి క్యాబినెట్ నిర్ణయాలను కాదని పేర్కొన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తప్పుపట్టారు. బందిపోటులను రక్షించేందుకే ఈ ప్రభుత్వం (కాంగ్రెస్) ఉందని ఘాటుగా విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed