439 కోట్ల బ్యాంకు లోన్‌కు ఎగనామం.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

by Hajipasha |
439 కోట్ల బ్యాంకు లోన్‌కు ఎగనామం.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళితో పాటు మరో ఇద్దరిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చక్కెర కర్మాగారాన్ని స్థాపించేందుకు సహకార బ్యాంకు నుంచి తీసుకున్న రూ.439.07 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారనే అభియోగాలతో రమేష్ జార్కిహోళి‌పై ఈ కేసును రిజిస్టర్ చేశారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకుండా చీటింగ్‌కు పాల్పడ్డారంటూ కర్ణాటక స్టేట్‌ కోఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ చామ్‌రాజ్‌పేట బ్రాంచ్‌ మేనేజర్‌ రాజన్న ముత్తశెట్టి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. సౌభాగ్యలక్ష్మి షుగర్స్‌ లిమిటెడ్‌ పేరుతో బెళగావిలో చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు, విస్తరణ కోసం జార్కిహోళి రుణం పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2013 సంవత్సరం నుంచి 2017 మధ్య రూ.232.88 కోట్ల రుణాన్ని మంజూరు చేశామని కర్ణాటక స్టేట్‌ కోఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ తెలిపింది. 2023 ఆగస్టు 31 నాటికి బ్యాంకుకు జార్కిహోళి తిరిగి చెల్లించాల్సిన బకాయి రూ.439.07 కోట్లుగా ఉందని పేర్కొంది.

లోన్ షరతులన్నీ ఉల్లంఘించారు

ఈ లోన్‌ను తాము మంజూరు చేసేటప్పుడు సౌభాగ్యలక్ష్మి షుగర్స్ లిమిటెడ్‌లో ఎవరిని కూడా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్‌‌గా నియమించకూడదనే షరతును విధించామని బ్యాంకు మేనేజర్ రాజన్న చెప్పారు. ఈ షరతును కూడా ఉల్లంఘించి బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండానే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను మార్చేశారని.. సంబంధం లేని వ్యక్తులను బోర్డులో నియమించారని ఆయన ఆరోపించారు. బ్యాంకును మోసం చేయాలనే ఉద్దేశంతోనే జార్కిహోళితో పాటు మరో ఇద్దరు ఆఫీస్ బేరర్లు కలిసి ఇదంతా చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజన్న వివరించారు.

Advertisement

Next Story