Kailash Gahlot: ఆప్‌కు భారీ షాక్.. పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా

by vinod kumar |   ( Updated:2024-11-17 09:59:24.0  )
Kailash Gahlot: ఆప్‌కు భారీ షాక్.. పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆమ్ ఆద్మీ పార్టీ(Aap)కు భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్( Kailash Gahlot) పార్టీని వీడారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌(Aravindh Kejriwal)కు పంపించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆప్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ‘ప్రజల హక్కుల కోసం పోరాడటంతో ఆప్ విఫలమైంది. ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు నెరవేర్చలేదు. సొంత ఎజెండా కోసమే పాకులాడుతోంది. యమునా నదిని స్వచ్ఛంగా మారుస్తామని హామీ ఇచ్చాం. కానీ అది గతంలో కంటే ఎక్కువగా కాలుష్యం బారిన పడింది’ అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆప్ విస్మరించిందని ఆరోపించారు.

‘పీష్ మహల్ లాంటి విచిత్రమైన వివాదాలు చాలా ఉన్నాయి. ఇవి అందరినీ అనుమానించేలా చేస్తున్నాయి. మనం ఇంకా ఆమ్ ఆద్మీనే నమ్ముతున్నామా అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. కేంద్ర ప్రభుత్వంతో విభేదాలతో ప్రభుత్వం కూరుకుపోతే ఢిల్లీకి నిజమైన ప్రగతి సాధ్యపడదు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో నేను నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించా. ఆ పనిని నిరంతరం కొనసాగించాలనుకుంటున్నా. అందుకే ఆప్ నుంచి వైదొలగడం తప్ప వేరే మార్గం లేదు’ అని కేజ్రీవాల్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆప్ భవిష్యత్‌ బాగుండాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, గెహ్లాట్ బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.


Read More..

CM Siddaramaiah : మహారాష్ట్రలో తప్పుడు యాడ్స్.. బీజేపీపై కేసు పెడతాం : సీఎం సిద్ధరామయ్య

Advertisement

Next Story

Most Viewed