Jds leader kumara swamy: ఎన్డీఏ కూటమిలో విభేదాలు..బీజేపీ తీరుపై జేడీఎస్ నేత కుమారస్వామి ఆసంతృప్తి

by vinod kumar |
Jds leader kumara swamy: ఎన్డీఏ కూటమిలో విభేదాలు..బీజేపీ తీరుపై జేడీఎస్ నేత కుమారస్వామి ఆసంతృప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీఏ కూటమిలో విభేదాలు వెలుగు చూశాయి. కూటమిలో కర్ణాటకలోని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఓ పాదయాత్రకు జేడీఎస్ మద్దతు నిరాకరించింది. అంతేగాక ఈ విషయంపై కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా ఆగస్టు 3 నుంచి ఏడు రోజుల పాటు పాదయాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడను ఆహ్వానించారు. అయితే దీనిపై కుమారస్వామి ఫైర్ అయ్యారు. న్యూఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవెగౌడ కుటుంబంపై విషం కక్కిన వ్యక్తితో వేదిక పంచుకోగలనా అంటూ ఘాటుగా స్పందించారు.

‘మమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేనప్పుడు, మేము వారికి ఎందుకు మద్దతివ్వాలి? పాదయాత్ర విషయంలో మాతో ఎలా వ్యవహరించారో వారే చెప్పాలి. ఈ విషయం నాకు బాధ కలిగిస్తుంది. ప్రీతమ్ జె గౌడ దేవేగౌడ కుటుంబాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఆయనను వేదికపైకి తీసుకొచ్చి నాతో కూర్చోబెట్టారు. ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో హసన్‌లో ఏం జరిగిందో బీజేపీకి తెలియదా? ఎన్నికల పొత్తు వేరు, రాజకీయాలు వేరు’ అని వ్యాఖ్యానించారు. ‘వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల పంట నష్టంతో రాష్ట్రం మొత్తం అల్లాడిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తే ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పాదయాత్ర నుంచి విరమించుకున్నాం’ అని తెలిపారు. ఈ పాదయాత్ర వల్ల రాష్ట్ర ప్రజలకు ఏం లాభం లేదన్నారు. న్యాయ పోరాటం ముఖ్యమని తెలిపారు. అందుకే బీజేపీ పాదయాత్రకు నైతిక మద్దతు కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దీంతో కుమారస్వామి వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో కొంత అసంతృప్తి కలిగే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed