Jammu kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ నేత రవీందర్ రైనా

by vinod kumar |
Jammu kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ నేత రవీందర్ రైనా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా తెలిపారు. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన జమ్మూలో మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ లోయలో 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ చర్చలు సఫలమైతే వారితో కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని, త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. బీజేపీ భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలుపొందడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

మెజారిటీ స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి చౌదరి జుల్ఫికర్ అలీ బీజేపీలో చేరడంపై రైనా స్పందిస్తూ..రాజౌరీ-పూంచ్ బెల్ట్‌లో అలీకి బలమైన మద్దతు ఉందని..ఆయన చేరికతో బీజేపీకి మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. ఆర్టికల్ 370పై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన ప్రకటనపై రైనా ఫైర్ అయ్యారు. జమ్మూ కశ్మీర్‌లో అబ్దుల్లా పార్టీ ప్రాబల్యం కోల్పోతోందని, అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

Advertisement

Next Story