జమ్మూకశ్మీర్‌లో భూముల కోసం 6,909 దరఖాస్తులు

by S Gopi |
జమ్మూకశ్మీర్‌లో భూముల కోసం 6,909 దరఖాస్తులు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో భూముల కొనుగోలు కోసం మొత్తం 6,909 దరఖాస్తులు వచ్చాయని సంబంధిత అధికారులు తెలిపారు. వాటిలో శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ కంపెనీ, వెల్‌స్పన్ గ్రూప్, దుబాయ్‌కి చెందిన ఎనార్ గ్రూప్‌లకు భూములను కేటాయించినట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. జూలై 3 నాటికి ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఉపయోగించి అన్ని దరఖాస్తులను ప్రాసెస్ చేస్తోంది. ఈ వెంచర్‌ల కోసం భూముల కేటాయింపు ద్వారా జమ్మూకశ్మీర్ ప్రాంతానికి రూ. 1.23 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అచనా. ఆ మొత్తంలో జమ్మూ ప్రాంతానికి రూ. 81,594.87 కోట్లు, కశ్మీర్‌కు రూ. 41,633.09 కోట్లు రావొచ్చు. ఈ పారిశ్రామిక యూనిట్ల ద్వారా 4,69,545 మందికి ఉపాధి కల్పించనున్నాయి. అందులో జమ్మూలో 2,17,760 మందికి, కశ్మీర్‌లో 2,51,785 మందికి ఉపాధి లభిస్తుంది. జమ్మూ డివిజన్‌లో 1,902 దరఖాస్తులే వచ్చినప్పటికీ, 4,935.61 ఎకరాల భూమి పరిశ్రమలకు ఆకర్షణీయంగా మారింది. ముఖ్యంగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లకు సమీపంలో ఉండే కథువా జిల్లాలో భూములకు ఎక్కువ డిమాండ్ ఉంది. కశ్మీర్ లోయలో 5,007 దరఖాస్తులు రాగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 3,671.98 ఎకరాల భూమి కోసం చూస్తున్నాయి. గత ఏడాది కాలంలో జమ్మూలో రూ. 21 వేల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని జమ్మూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ డా అరుణ్ కుమార్ మన్హాస్ చెప్పారు.

కీలక కంపెనీలు..

ప్రధాన కంపెనీల్లో థమ్సప్ లాంటి పాపురల్ బ్రాండ్‌ను తయారు చేసే కంధారి బెవరేజెస్ 36 ఎకరాల్లో రూ. 1,100 కోట్లతో పెట్ బాట్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే, శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌కు చెందిన సిలోన్ బెవరేజెస్ కథువాలో రూ. 1,600 కోట్లతో 25.75 ఎకరాల్లో బాటిల్ ఫిల్లింగ్, అల్యూమినియం డబ్బాల తయారీ కోసం పెట్టుబడులు పెట్టింది. ఇవి కాకుండా ఎన్నార్ గ్రూప్ ఐటీ టవర్ కోసం రూ. 500 కోట్లు, వెల్స్‌పన్ గ్రూప్ సింటెక్స్ వాటర్ ట్యాంకుల యూనిట్ల నిర్మాణానికి రూ. 850 కోట్లు, కథువాలో హల్దీరామ్ యూనిట్ల కోసం రూ. 585 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed