దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ‘జమిలి’ జగడం.. బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా ఇలా జరగాల్సిందే..!

by Satheesh |   ( Updated:2023-09-02 05:21:20.0  )
దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ‘జమిలి’ జగడం.. బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా ఇలా జరగాల్సిందే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్ర మంత్రి ప్రకటన చేయడంతో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ బిల్లుపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. దీన్ని వీలైనంత తొందరగా కొలిక్కి తేవాలన్న లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రత్యేక సెషన్‌లో ఈ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు రానున్నది.

రాజ్యాంగంలోని ఐదు అధికరణాలకు సవరణలు చేయాల్సి వస్తుండడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ఈ బిల్లుకు ఆమోదం లభించాల్సి ఉన్నది. ఆ తర్వాత దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల్లోని సగం స్టేట్స్ దీన్ని రాటిఫై చేయాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా ఈ అంశాన్ని తెరమీదకు తేవడాన్ని ప్రతిపక్షాలు ఊహించలేకపోయాయి. రాజ్యాంగ సవరణలతో పాటు లోక్‌సభ, పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీల రూల్స్‌లోనూ మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది.

గతంలో జీఎస్టీ బిల్లుకు జరిగిన ప్రక్రియ మొత్తం ఇప్పుడు జమిలి ఎన్నికల బిల్లు విషయంలో పాటించాల్సి ఉంటుంది. త్వరలో ఐదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అమలులోకి వస్తుందా? ఈ రాష్ట్రాల ఎన్నికలు.. షెడ్యూలు కన్నా ఆలస్యమవుతాయా?.. లేక లోక్‌సభ ఎన్నికలే ముందుకొస్తాయా?.. బిల్లు చట్టంగా మారిన వెంటనే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఇది కంప్లీట్ స్పిరిట్‌తో అమలవుతుందా?.. 2029 నాటికి ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా?.. ఇలాంటి అనేక సందేహాలు తెర మీదకు వచ్చాయి.

నాలుగు దశాబ్దాల ప్రహసనం:

1983లోనే జమిలి ఎన్నికల ప్రస్తావన చర్చకు వచ్చింది. జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి అధ్యక్షతన లా కమిషన్ అధ్యయనం చేసి 1999లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన 170వ రిపోర్టులో దీనిపై స్పష్టత ఇచ్చింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరిపించాలని సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పాయి.. ప్రతిపక్ష నేత సోనియాగాంధీతో చర్చించారు. సోనియా నుంచి సానుకూల స్పందనే వచ్చింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2010లో బీజేపీ నేత అద్వానీ జమిలి విషయాన్ని అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌, ప్రణబ్‌ముఖర్జీతో చర్చించారు.

వారి నుంచి సైతం సానుకూల స్పందన వచ్చినా ఆచరణలోకి రాలేదు. నాలుగేండ్ల క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా సైతం జమిలి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నట్టు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ రిఫార్మ్స్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో, ఆ తర్వాత 2019 ప్రణాళికలో బీజేపీ దీనిని ప్రస్తావించింది. ప్రధాని మోడీ సైతం జమిలి ఎన్నికల అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. అధికారులతోనూ చర్చించారు.

చివరకు 2015లో ఎంపీ సుదర్శన్ నాచియప్పన్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్సనల్-లా-జస్టిస్ శాఖ) చర్చించి జమిలి ఎన్నికల నిర్వహణలోని అనుకూల, ప్రతికూల పరిస్థితులను వివరించింది. ప్రస్తుత పొలిటికల్ పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చనే సందేహాన్ని వ్యక్తం చేస్తూనే ఇది జాతి అవసరాలకు చాలా ఉపయోగపడే విధానమని, అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే అమలు కష్టమేమీ కాదని మాజీ ఈసీలు సునీల్ అరోరా, ఎస్‌వై ఖురేషీ, సుశీల్ చంద్ర తదితరులు పేర్కొన్నారు.

1952, 1957లో ‘ఒకేసారి ఎన్నికలు’

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952, 1957లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత లోక్‌సభ, అసెంబ్లీలకు విడివిడిగే ఎన్నికలు జరిగే ప్రాక్టీసు మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను ప్రయోగించడంతో కేరళలోని నంబూద్రిపాద్ ప్రభుత్వం 1959 జూలైలో (రెండేండ్లకే) కూలిపోయింది. 1960లో ఎన్నికలు జరగాల్సి వచ్చింది. లోక్‌సభల విషయానికి వస్తే మొదటి, రెండో, మూడో, 8వ, 10వ, 14వ, 15వ సభలు మాత్రమే ఫుల్ టర్ము అధికారంలో కొనసాగాయి. మిగిలినవన్నీ మధ్యలోనే రద్దయ్యాయి.

ఏమేం సవరణలు చేయాలి..?

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానం చట్టంగా మారి అమల్లోకి రావాలంటే రాజ్యాంగానికి ఐదు రకాల సవరణలు జరగాలి. ఆర్టికల్ 83 (లోక్‌సభ గడువు), 85 (సభ రద్దు), 172 (అసెంబ్లీల గడువు), 174 (శాసనసభల రద్దు), 356 (రాష్ట్రపతి పాలన) లకు సవరణలు జరగాలి. అన్ని రాజకీయ పార్టీల మద్దతు, ఏకాభిప్రాయం అవసరం. దీనికి తోడు లోక్‌సభ, అసెంబ్లీల నిబంధనావళిలోనూ మార్పులు జరగాలి. పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. ఆ తర్వాత మొత్తం రాష్ట్రాల అసెంబ్లీలలో సగం ఈ బిల్లును రాటిఫై చేయాల్సి ఉంటుంది.

మరో రకంగా దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ సమయానికి హాజరైనవారిలో మూడింట రెండొంతల మంది సభ్యుల ఓటింగ్ అవసరం. లోక్‌సభలో మొత్తం 543 సభ్యుల్లో 364 మంది (67%) మద్దతు అవసరం. బీజేపీ, మిత్రపక్షాల బలం 333 ఉన్నది. వైసీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీల నుంచి సహకారం తీసుకోవాల్సి ఉంటుంది.

రాజ్యసభలో 245 మందిలో 165 మద్దతు అవసరం. కానీ బీజేపీకి 93 మంది మద్దతు మాత్రమే ఉన్నది. అదనంగా కొన్ని పార్టీలతో మాట్లాడి మద్దతు పొందాల్సి ఉంటుంది. చర్చ సమయంలో సభలో ఆ టైమ్‌కు ఎంతమంది హాజరవుతారనేది కీలకంగా మారింది. బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా మరో ఎనిమిది రాష్ట్రాల్లో సంకీర్ణంలోని పార్టీల, సహకారం అందించే పార్టీల మద్దతు ఉన్నది.

పలు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకం

జమిలి ఎన్నికల కోసం లా కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పలుసార్లు గుర్తింపు పొందిన పార్టీల అభిప్రాయాలను తీసుకున్నది. దాదాపుగా మెజారిటీ పార్టీలు సానుకూలంగా స్పందించాయి. మజ్లిస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, కాంగ్రెస్ లాంటి వాటితో పాటు పలు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇందుకు ఆచరణ సాధ్యం కాని అంశాలు ఉన్నాయని పేర్కొన్నాయి.

బీఆర్ఎస్ సహా అనేక పార్టీలు సానుకూలంగా స్పందించాయి. కొన్ని పార్టీలు సూత్రప్రాయంగా స్వాగతించినా సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. అన్ని పార్టీల అభిప్రాయాలు ఎన్నికల కమిషన్ దగ్గర రికార్డయ్యి ఉన్నాయి. పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

అనుకూల, ప్రతికూల అంశాలు

జమిలి ఎన్నికల్లో అనుకూల, ప్రతికూల అంశాలున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా ప్రభుత్వాలకు ఖర్చు తగ్గుతుంది. సమయం సైతం కలిసొస్తుంది. తరచూ ఎన్నికల కోడ్ ఆంక్షల్లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బందులు తగ్గుతాయి. ఓటర్లకు సౌకర్యంగా ఉంటుంది. పోలింగ్ శాతం పెరుగుతుంది. ఎన్నికల సిబ్బంది, పోలీసుల రూపంలో మ్యాన్‌పవర్ సమస్యలు మినిమైజ్ అవుతాయి.

మరో‌వైపు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గుతుంది. స్థానిక అంశాల ప్రయారిటీ తగ్గి జాతీయ అంశాలే కీలకంగా మారుతాయి. రాజ్యాంగ సవరణకు లీగల్ చిక్కులు, అన్ని పార్టీల ఏకాభిప్రాయ సాధనలో సమస్యలు, జాతీయ పార్టీలతో ఖర్చు సహా చాలా అంశాల్లో ప్రాంతీయ పార్టీలు పోటీ పడలేవనే భయం, భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళనలు ప్రతికూల అంశాలుగా ఉన్నాయి.

అర్ధాంతరంగా సభలు రద్దయితే ఎలా..?

జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అర్ధాంతరంగా శాసనసభలు లేదా లోక్‌సభ రద్దయితే మళ్లీ సైకిల్ మారిపోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నీతి ఆయోగ్, లా కమిషన్ చేసిన సిఫారసుల్లో ఇందుకు పలు ప్రత్యామ్నాయాలను చూపింది.

ఐదేండ్ల గడువులో మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహించడం, రెండో స్థానంలో ఉన్న పార్టీని ప్రభుత్వ స్థాపనకు ఆహ్వానించడం, రాష్ట్రపతి పాలనను కొనసాగించడం లాంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజా సెషన్‌లో పెట్టే బిల్లులో ఎలాంటి అంశాలను పొందుపరుస్తుందనేది కీలకం. గతంలో వివిధ పార్టీల అభిప్రాయాలు సైతం ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయా అనేది గమనార్హం.

ఎన్నికలకు భారీ ఖర్చు

ఎన్నికల నిర్వహణకు ప్రతిసారీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఖర్చు పెరుగుతూనే ఉన్నది. గత లోక్‌సభ (2019) ఎన్నికలకు సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా. తెలంగాణ అసెంబ్లీకి గతంలో (2018లో) రూ.350 కోట్లు ఖర్చయితే ఈసారి అది రూ.500 కోట్లు దాటుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం భావిస్తున్నది. ఇక రాజకీయ పార్టీలు, పోటీచేసే అభ్యర్థులు పెట్టే ఖర్చు దీనికి అదనం. ఒక్కో అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో (దక్షిణాది రాష్ట్రాల్లో) సగటున రూ.100 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అంచనా.

గతంలో జమిలి ఎన్నికల గురించి కసరత్తు మొదలుపెట్టినప్పుడే ఈవీఎంలు, వీవీ ప్యాట్ మిషన్లకు ఎంత ఖర్చవుతుందో లోక్‌సభ, కేంద్ర ఎన్నికల సంఘం లెక్కలు వేసుకున్నాయి. ఒక్కో ఈవీఎం (బ్యాలట్, కంట్రోల్ యూనిట్లు)కు రూ.17,500 (2013 నాటి లెక్కల ప్రకారం) చొప్పున మొత్తం 28 లక్షల బ్యాలట్ యూనిట్లు, 24 లక్షల కంట్రోల్ యూనిట్లకు రూ.3,570 కోట్లు అవసరమవుతుందని తేలింది. దేశం మొత్తం మీద సుమారు 10 లక్షల పోలింగ్ కేంద్రాలుంటాయన్న అంచనాతో రిజర్వులో పెట్టుకునే 40% ఈవీఎంలను కలిపి లెక్కించింది.

ఇక ఒక్కో వీవీ ప్యాట్‌కు రూ.22,853 చొప్పున మొత్తం 10 లక్షల కేంద్రాల్లో రెండు చొప్పున, రిజర్వులో ఉంటే వాటితో కలుపుకుని 25 లక్షల యూనిట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. ఇందుకు సుమారు రూ. 5,713 కోట్లు కావాల్సి ఉంటుందని పేర్కొన్నది. మొత్తంగా రూ.9,284 కోట్లు జమిలి ఎన్నికలకు (ఈ మిషన్లను సమకూర్చుకోడానికే) కావాల్సి ఉంటుందని లెక్కలు వేశాయి.

త్వరలో 11 రాష్ట్రాల్లో ఎన్నికలు

షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబరు 16 నాటికి మిజోరాంలో, వచ్చే ఏడాది జనవరి సెకండ్ వీక్ నాటికి తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు, మే నెలలో ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు, నవంబరులో హర్యానా, మహారాష్ట్రలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం లభిస్తే హర్యానా, మహారాష్ట్రలకు అడ్వాన్సుగా, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఆలస్యంగా ఎన్నికలు జరిగే అవకాశమున్నది.

లోక్‌సభ ఎన్నికలతో పాటే ఈ 11 రాష్ట్రాలకూ కలిపి జరిగే చాన్స్ ఉన్నది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు నాలుగైదు నెలలు ఆలస్యంగా నిర్వహించడానికి పార్లమెంటు ద్వారా ప్రత్యేక చట్టం తీసుకురావడమో లేక రాష్ట్రపతి పాలనలోకి తీసుకెళ్లడమో చేయాల్సి ఉంటుందనే చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed