Jagdeep Dhankhar: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్రలు.. ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ ఫైర్

by vinod kumar |
Jagdeep Dhankhar: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్రలు.. ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పటిష్ట స్థితిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఆరోపించారు. నేషనల్ లా యూనివర్శిటీ (ఎన్‌ఎల్‌యూ)లో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఉద్దేశించిన కథనాలపై ఎంతో ఆందోళన చెందానని తెలిపారు. దేశం కంటే పక్షపాతం, స్వప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే శక్తులను యువత నిర్వీర్యం చేయాలని పిలుపునిచ్చారు. ఇటువంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించొద్దని స్పష్టం చేశారు.

‘సంస్థ అధికార పరిధి భారత రాజ్యాంగం ద్వారా నిర్వచించారు. అది శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ ఏదైనా కావచ్చు. న్యాయస్థానాల అధికార పరిధి సైతం నిర్ణయించబడింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికాలోని సుప్రీం కోర్ట్, యూకేలోని అత్యున్నత న్యాయస్థానం, ఒక్కసారి అయినా రాజ్యాంగంలో పొందిపర్చిన నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు’ అని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల కోర్టుల పనితీరును పరిశీలించాలని విద్యార్థులను కోరారు.

కాగా, ఇటీవల హిండెన్‌బర్గ్ వెల్లడించిన నివేదికపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ధన్‌ఖడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాహుల్ పేరు తీసుకోకుండా పరోక్షంగా ఆనపైనే విమర్శలు చేశారని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Next Story