Sukesh Chandrasekhar : జాక్వెలిన్‌కు బర్త్‌డే గిఫ్టుగా ఖరీదైన నౌక.. జైలు నుంచి సుకేశ్‌ సంచలన లేఖ

by Hajipasha |
Sukesh Chandrasekhar : జాక్వెలిన్‌కు బర్త్‌డే గిఫ్టుగా ఖరీదైన నౌక.. జైలు నుంచి సుకేశ్‌ సంచలన లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలో జైలు గోడల మధ్యే ఉన్నా ఆర్థిక మోసాల కేసు నిందితుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ తన లేఖలతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఆదివారం రోజు (ఆగస్టు 11న) బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పుట్టిన రోజు. ఈసందర్భంగా ఆమెకు తాను లెటర్ రాశానని సుకేశ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించాడు.‘‘2021లో నేను జాక్వెలిన్‌‌కు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఒక పడవను సెలెక్ట్ చేశాను. దానికి ‘లేడీ జాక్వెలిన్’ అని పేరు పెట్టాలని అప్పుడే నిర్ణయించాను. జాక్వెలిన్ బర్త్‌డే సందర్భంగా ఈనెలలోనే ఆ పడవను ఆమెకు అందేలా చూస్తాను. అన్ని రకాల పన్నులను చెల్లించి, సక్రమమైన గిఫ్టుగా దాన్ని జాక్వెలిన్‌కు అప్పగిస్తాను’’ అని లెటర్‌లో సుకేశ్‌ చెప్పుకొచ్చాడు. ‘‘ఇద్దరం కలిసి సముద్రంలో పడవలో జలయాత్ర చేయాలని కలలు కనే వాళ్లం. అందుకే ఆ పడవను బహుమతిగా ఇస్తున్నా’’ అని తెలిపాడు. జాక్వెలిన్‌ను ఎంతో ఆదరిస్తున్న ఆమె అభిమానులకు 100 ఐఫోన్ 15 ప్రో ఫోన్లను గిఫ్టుగా అందిస్తానని సుకేశ్ చెప్పాడు. తన టీమ్ వారిని ఎంపిక చేస్తుందన్నాడు. రోమియో, జూలియెట్ స్టైల్‌లో 2025 ఆగస్టు 11న జాక్వెలిన్‌తో కలిసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటానని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘‘మై బేబీ గర్ల్, మై బొమ్మ’’ ..

జాక్వెలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘‘మై బేబీ గర్ల్, మై బొమ్మ’’ అని లెటర్‌లో అతడు సంబోధించడం గమనార్హం. వచ్చే ఏడాది ఆమె ఆరోగ్యపరంగా, కెరీర్‌లో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నట్లు సుకేశ్ చెప్పాడు. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ.. వారి ఆలోచనలు, మనసులు కలిసే ఉన్నాయన్నాడు. ‘‘అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని జాక్వెలిన్ భావిస్తుంటుంది. జంతు సంక్షేమం కోసం పాటుపడాలని ఆమె కోరుకుంటుంది. ఆమె ఆలోచనలను గౌరవిస్తూ కేరళలోని వయనాడ్ విపత్తు బాధిత కుటుంబాలకు రూ.15 కోట్ల విరాళం అందిస్తా. విపత్తులో నిలువనీడ కోల్పోయిన వారికి 300 ఇళ్లు కట్టిస్తా’’ అని సుకేశ్‌ చంద్రశేఖర్‌ లెటర్‌లో ప్రకటించాడు. తన హామీలను నెరవేర్చే విషయంలో కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేశానని వెల్లడించాడు. ప్రైవేటు విమానం, పడవ, వజ్రాల వంటి గిఫ్టుల కంటే ఇతరులకు సాయం చేయడంలోనే జాక్వెలిన్ ఆనందాన్ని వెతుక్కుంటుందని తనకు తెలుసని సుకేశ్ కామెంట్ చేశాడు. కాాగా, రూ.200 కోట్ల అక్రమ నగదు చలామణీ కేసులో 2015 మే 29న అరెస్టయిన సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం ఢిల్లీలో జైలులో ఉన్నాడు. గతనెలలో ఓ కేసులో బాంబే హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇతర పెండింగ్ కేసుల కారణంగా ఇంకా జైల్లోనే ఉండిపోయాడు.

Advertisement

Next Story