Israel: ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలంటూ పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

by vinod kumar |
Israel: ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలంటూ పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, ఇతర సైనిక పరికరాలను ఎగుమతి చేయడానికి వివిధ కంపెనీలకు ఇప్పటికే ఉన్న లైసెన్స్‌లను రద్దు చేయాలని, కొత్త లైసెన్స్‌ల మంజూరును నిలిపివేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయుధాల సరఫరాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రిటైర్డ్ పబ్లిక్ సర్వెంట్లు, సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని సీజేఐ చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.

ఏ దేశానికైనా పరికరాలను ఎగుమతి నిలిపివేయాలని భారత ప్రభుత్వాన్ని ఆదేశించడం తన అధికార పరిధికి మించిన పని అని, ఇది పూర్తిగా విదేశాంగ విధానానికి సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌కు భారతీయ కంపెనీల ఆయుధాల సరఫరా అంతర్జాతీయ ఒప్పందం ద్వారా నిర్వహించబడుతుందని, దీనిని న్యాయస్థానం ఉల్లంఘించలేదని తెలిపింది. ‘భారత్ రష్యా నుంచి చమురును పొందుతుంది. రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేయాలని సుప్రీంకోర్టు చెప్పగలదా? ఈ నిర్ణయాలు విదేశాంగ విధానానికి సంబంధించినవి, ఇంధన సరఫరా దేశ అవసరాలపై ఆధారపడి ఉంటాయి’ అని ధర్మాసనం పేర్కొంది.

విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. భారత ప్రభుత్వం మారణహోమం, యుద్ధ నేరాలకు పాల్పడే దేశానికి ఆయుధాలను సరఫరా చేస్తోందని తెలిపారు. ఇజ్రాయెల్ పాఠశాలలు, ఆస్పత్రులపై బాంబులు వేసి అమాయకులను చంపడంలో పాలుపంచుకుందని తెలిపారు. గాజాలో యుద్ధం జరుగుతున్న సమయంలో భారతదేశం ఆయుధాలు సరఫరా చేసిందని చెప్పారు. అయితే పిటిషనర్లు, మారణహోమం వంటి పదాలను ఉపయోగించారని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది.

Advertisement

Next Story

Most Viewed