Iraq: వివాదాస్పద చట్టం.. బాలికల వివాహ వయసు 9 ఏళ్లకు తగ్గింపు

by Shamantha N |   ( Updated:2024-08-09 08:18:16.0  )
Iraq: వివాదాస్పద చట్టం.. బాలికల వివాహ వయసు 9 ఏళ్లకు తగ్గింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాక్ పార్లమెంటులో వివాదాస్పత చట్టాన్ని ప్రతిపాదించారు. బాలికల వివాహానికి చట్టబద్ధమైన వయసును 9 ఏళ్లకు తగ్గించాలని ఆ బిల్లులో పేర్కొన్నారు. కాగా.. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు, ఆందోళనలు చెలరేగాయి. ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన వివాదాస్పద చట్టం.. అక్కడి వ్యక్తిగత స్థితి చట్టాన్ని సవరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప్రస్తుతం వివాహానికి కనీస వయసు 18గా ఉంది. కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి ఈ బిల్లు పౌరులను అనుమతిస్తుంది. ఇది వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాల్లో హక్కులను తగ్గించడానికి దారితీస్తుందని విమర్శకులు భయపడుతున్నారు.

9 ఏళ్లలోపు బాలికలు.. 15 ఏళ్లలోపు అబ్బాయిలు

ఈ బిల్లు ఆమోదం పొందితే 9 ఏళ్లలోపు బాలికలు, 15 ఏళ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇది పెరిగిన బాల్య వివాహాలు, దోపిడీ భయాలను రేకెత్తిస్తుంది. ఈ తిరోగమన చర్య వల్ల మహిళల హక్కులు, లింగసమానత్వాన్ని ప్రోత్సహించేందుకు దశాబ్దాల పాటు చేసిన కృషిని అణగదొక్కుతుందని పలువురు వాదిస్తున్నారు. మానవ హక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. యువత విద్య, ఆరోగ్యం, శ్రేయస్సుపై తీవ్రమైన పరిణామాలు పడతాయని హెచ్చరిస్తున్నారు. బాల్య వివాహాలు, డ్రాపౌట్ రేట్లు, గృహహింస పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ఇరాక్‌లో 28 శాతం మంది బాలికలు ఇప్పటికే 18 ఏళ్లలోపు వివాహం చేసుకున్నారు. ఈ చట్టాన్ని ఆమోదించడం వల్ల దేశం ముందుకు వెళ్లకుండా.. అభివృద్ధి నిలిచిపోతుందని హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) పరిశోధకురాలు సారా సన్బర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed