- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం అజర్‌బైజాన్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హోసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్‌మతీ కూడా చనిపోయారు. హెలికాప్టర్ పూర్తిగా కాలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 12 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత సంఘటనా స్థలం నుంచి వీరందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాదంపై ఇరాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం సాయంత్రం ప్రమాదం జరగగా.. సోమవారం ఉదయం వరకు కూడా ఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం ఎవరికీ తెలియరాలేదు. హెలికాప్టర్ శకలాలను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇరాన్ అధ్యక్షుడి వెంట వెళ్లిన రెండు హెలికాప్టర్లు సురక్షితంగానే తిరిగి రావడం, రైసీ ఉన్న హెలికాప్టర్ మాత్రమే క్రాష్ అవడం, రైసీ ప్రయాణించిన అమెరికా హెలికాప్టర్, దాని పైలట్ సహా అనేక అంశాలు ప్రశ్నలుగానే మిగిలాయి.
టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో..
ఇరాన్ మీడియా కథనం ప్రకారం.. ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యామ్‌లను ఇరు దేశాలు నిర్మించాయి. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్‌హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి హోసేన్, ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్‌లో బయలుదేరారు. వారి వెంట మరో రెండు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదుపు తప్పి, ఈస్ట్ అజర్‌బైజాన్ సరిహద్దుల్లోని పర్వతాల్లో కుప్పకూలింది.ఆ ప్రదేశం దేశ రజాధాని టెహ్రాన్‌కు వాయవ్య దిశలో సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని గురించి తెలిసిన వెంటనే త్రివిధ దళాలు అత్యంత వేగంగా సహాయక చర్యలను ప్రారంభించాయి.
రాత్రంతా సహాయక చర్యలు..
ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ ప్రమాదం జరగ్గా రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి. ఎట్టకేలకు సోమవారం ఉదయం ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ(ఐఆర్‌సీఎస్) గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ మొత్తం ధ్వంసం కాగా, ఎవరూ బతికే అవకాశం లేదని ఐఆర్‌సీఎస్ ప్రకటించింది. ఆ తర్వాత కొద్దిసేపటికీ ఇరాన్ అధ్యక్షుడి మరణవార్తను జాతీయ మీడియా ధృవీకరించింది. హెలికాప్టర్ శకలాల దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆచూకీ కోసం రష్యా సైతం సహాయం అందించింది. రష్యా 47 మంది నిపుణులు, హెలికాప్టర్, ఇతర సహాయక వాహనాలను పంపింది. అధ్యక్షుడి కాన్వాయ్‌లోని మరో రెండో హెలికాప్టర్లు క్షేమంగా ల్యాండ్ అయ్యాయని ఇరాన్ ఎంపీ అహ్మద్ అలీ రెజాబెగీ తెలిపారు.
ఇబ్రహీం రైసీ గురించి..
ఇస్లామిక్ సంప్రదాయవాదిగా పేరున్న ఇబ్రహీం రైసీ దేశ అత్యున్నత మతపెద్ద అయతుల్లా అలీ ఖొమేనీకి అత్యంత సన్నిహితుడు. 2021లో జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రైసీ, ఇరాన్ న్యాయవ్యవస్థకు అధిపతిగా పనిచేశారు. ఆయన రాజకీయ సిద్ధాంతాన్ని ఇస్లామిక్ వాదంగా చెబుతుంటారు. 63 ఏళ్ల రైసీ తన పాతికేళ్ల వయసులోనే టెహ్రా్‌లో డిప్యూటీ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2014లో ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్‌గా నియమితుడయ్యారు. అంతకుముందు న్యాయవ్యవస్థ మొదటి డిప్యూటీ హెడ్‌గా కూడా పనిచేశారు. 2017లో తిలిసారి ఇరాన్ అధ్యక్ష పదివికి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.
ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అనుమానాలు
విమాన ప్రమాదంలో ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్‌లు మరణించారు. ఇద్దరు శక్తి వంతమైన ఇరాన్ నాయకులు అనూహ్యంగా ఒకేసారి మరణించడంతో ప్రమాదంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ క్రాష్ అయినట్టు స్థానిక కథనాలు వెల్లడించినా.. విమానాన్ని క్రాష్ చేయడంలో విదేశీ శత్రువుల ప్రమేయం ఏమైనా ఉందా అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే అజర్ బైజాన్ నుంచి తిరుగు ప్రయాణంలో రైసీ ప్రయాణిస్తున్న విమానంతో పాటు వారికి రక్షణగా మరో రెండు విమానాలు వెళ్లాయి. అందులో కేవలం రైసీ ప్రయాణిస్తున్న విమానం మాత్రమే ప్రమాదానికి గురికాగా..మిగిలిన రెండు హెలికాప్టర్లు సురక్షితంగానే ఉన్నాయి. దీంతో ఘటన వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడం, అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడిన నేపథ్యంలో ప్రమాదం జరగడం కూడా అనుమానాలను పెంచుతోంది.
అమెరికా కుట్ర?
రైసీ మరణం వెనుక అమెరికా కుట్ర ఏమైనా ఉందా అని మరికొందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో అమెరికా కలుగజేసుకోవడం, ఇజ్రాయెల్‌పై దాడి చేయొద్దని ఇరాన్‌కు సూచించడం, అయినప్పటికీ ఇరాన్ పట్టించుకోకుండా దాడికి పాల్పడి.. అమెరికాకే తిరిగి వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే యూఎస్ పైనా దాడి చేస్తామని తెలిపింది. ఆ తర్వాతే అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. అంతేగాక ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న విమానం కూడా అమెరికా తయారు చేసిన ‘బెల్ 212’ హెలికాప్టర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రైసీ మృతి వెనుక యూఎస్ కుట్ర చేసిందా? అని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఈ ప్రమాదం వెనుక అమెరికా ఉందని తేలితే ఇరాన్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
పైలట్ ‘మొసాద్’ ఏజెంట్!
ఇదే సమయంలో ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న విమానాన్ని నడిపిన పైలట్ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’కు ఏజెంట్ అని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రహస్య కార్యకలాపాలకు పేరుగాంచిన మొసాద్ గతంలోనూ పలు ఘటనల్లో ప్రమేయం కలిగి ఉంది. దీంతో ఇజ్రాయెల్ ఏమైనా ప్రతీకార చర్యలకు పాల్పడిందా అనే అనుమానం కలుగుతోంది. అయితే ఒక దేశ అధ్యక్షుడిని చంపేంత సాహసం ఎవరూ చేసి ఉండకపోవచ్చని, దేశాధినేతను హత్య చేయడం అంటే ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రోత్సహించడమేనని పలువురు భావిస్తున్నారు. అయితే కుట్ర కథనాలపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.
తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్..
దేశ అధ్యక్షుడి మరణంతో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అయిన మహమ్మద్ మొఖ్బర్ నియమితులయ్యారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలి ఖమేనీ దీనికి ఆమోదం తెలిపారు. అనంతరం రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, దేశంలో ఐదు రోజుల సంతాప దినాలను ప్రకటించారు.
ఇరాన్‌లో ఏం జరగబోతోంది..
అధ్యక్షుడి మరణంతో ఇరాన్‌లో క్లిష్టమైన నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. రైసీ మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(85) స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశంపై చర్చ ముందుకొచ్చింది. రైసీ మరణంతో చాలా కాలంగా అలీ ఖమేనీ ఆరోగ్యం ఆసక్తి నెలకొన్న పరిణామాల మధ్య ఆయన ప్రభుత్వ అంతాన్ని ప్రత్యర్థులు ఆశిస్తున్నారు. కొత్త సుప్రీం లీడర్‌ను ఎంచుకునే అధికారం ఉన్న 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్'లో రైసీ సైతం సభ్యుడిగా ఉన్నారు. ఇది కీలకమైన స్థానం. ఇప్పుడు ఆ స్థానాన్ని తప్పనిసరిగా భర్తీ చేయాలి. అలీ ఖమేనీకి రైసీ అసలైన వారసుడని ఎంతో కాలంగా అందరూ భావిస్తున్నారు. ఇన్ని పరిణామాల మధ్య ఇప్పటికిప్పుడు ఇరాన్‌లో ముందస్తు అధ్యక్ష ఎన్నికలను నిర్వహించడమే కీలకమైన రాజకీయ సవాలు. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మాద్ మొఖ్బర్ ఉన్నప్పటికీ 50 రోజుల్లోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించి తీరాలి. రైసీ స్థాయిలో కచ్చితమైన వారసుడు అక్కడ కనిపించకపోవడం కీలకంగా మారింది.
భారత ప్రధాని మోడీ సంతాపం..
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడ్ ఇబ్రహీం రైసీ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌లో.. ‘‘ఇబ్రహీం రైసీ మృతి బాధాకరం. ఆయన మరణవార్తం తనను ఎంతో కలచివేసింది. ఇరాన్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు రైసీ కృషిని మరువలేం. ఆయన కుటుంబసభ్యులకు, ఇరాన్ ప్రజలకు సంతాం తెలియజేస్తున్నాను. ఇలాంటి సమయంలో ఇరాన్‌కు భారత్ అండగా నిలుస్తుందని’’ ఆయన ట్వీట్ చేశారు. అమెరికా, రష్యా, బ్రిటన్ సహా అన్ని ప్రపంచ దేశాల అధినేతలు కూడా రైసీ మరణంపై ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించాయి.