రూ. 7.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

by S Gopi |
రూ. 7.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలతో పాటు త్రైమాసిక ఫలితాలు, కీలక రంగాల్లో అమ్మకాలు, విదేశీ ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లను కోల్పోయింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,062.22 పాయింట్లు పతనమై 72,404 వద్ద, నిఫ్టీ 345 పాయింట్లు నష్టపోయి 21,957 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో మినహా అన్ని రంగాలు కుదేలయ్యాయి. దాదాపు అన్ని రంగాలు 2 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎల్అండ్‌టీ, ఏషియన్ పెయింట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.50 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాల కారణంగా మదుపర్లు గురువారం ఒక్కరోజే రూ. 7.3 లక్షల కోట్లకు పైగా కోల్పోగా, బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 393.73 లక్షల కోట్లుగా ఉంది.

Advertisement

Next Story