విద్యకు రూ.1.20 లక్షల కోట్లు.. కొత్త మెడికల్ కాలేజీలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు

by Hajipasha |
విద్యకు రూ.1.20 లక్షల కోట్లు.. కొత్త మెడికల్ కాలేజీలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని మరిన్ని కొత్త మెడికల్ కాలేజీలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలను ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ విద్యా విధానం- 2020 ద్వాారా దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ‘‘డాక్టర్ కావాలనేది చాలా మంది యువత ఆశయం.దీన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం. వివిధ విభాగాల కింద ప్రస్తుతమున్న హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించి మరిన్ని మెడికల్ కాలేజీలను స్థాపించాలని మా ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం’’ అని ఆమె తెలిపారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి ఆర్థిక మంత్రి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తాజా బడ్జెట్‌లో కేంద్ర విద్యాశాఖకు రూ.1,20,627.87 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇది రూ.1,12,899 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులను స్వల్పంగా రూ.8వేల కోట్ల మేర పెంచారు. మొత్తం రూ.1.20 లక్షల కోట్ల విద్యాశాఖ బడ్జెట్‌లో పాఠశాల విద్యాశాఖకు అత్యధికంగా రూ.73,008 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.47,619 కోట్లను కేటాయించారు.

విభాగాలవారీగా కేటాయింపులు ఇలా..

* నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్‌కు గతేడాది రూ.33,500 కోట్లు కేటాయించగా ఈసారి రూ.37,500 కోట్లు అలాట్ చేశారు.

* కేంద్ర ఉన్నత విద్యా విభాగం ద్వారా గతేడాది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కోసం రూ.3980 కోట్లు కేటాయించగా ఈసారి రూ.5672 కోట్లు కేటాయించారు.

* కేంద్ర ఉన్నత విద్యా విభాగం ద్వారా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములకు కేటాయింపును రూ.500 కోట్ల నుంచి రూ.1800 కోట్లకు పెంచారు.

* కేంద్ర ఉన్నత విద్యా విభాగం ద్వారా ఇతరత్రా కేంద్ర ప్రభుత్వరంగ వ్యయాలు గతేడాది రూ.52,494 కోట్లు ఉండగా.. ఈసారి వాటిని రూ.39884 కోట్లకు తగ్గించారు.

* కేంద్ర పాఠశాల విద్యావిభాగం ద్వారా సెంట్రల్ సెక్టార్ స్కీములకు గతేడాది రూ.358 కోట్లు కేటాయించగా..ఈసారి కూడా దాదాపు అదే స్థాయిలో (రూ.377 కోట్లు) కేటాయించారు.

* కేంద్ర పాఠశాల విద్యావిభాగం ద్వారా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములకు గతేడాది రూ.46,600 కోట్లు.. ఈసారి రూ.57427 కోట్లు అలాట్ చేశారు.

* కేంద్ర పాఠశాల విద్యావిభాగం ద్వారా ఇతరత్రా సెంట్రల్ సెక్టార్ వ్యయాలను రూ.25470 కోట్ల నుంచి రూ.15148 కోట్లకు తగ్గించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed