జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు సభ్యత్వం..

by Vinod kumar |
జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు సభ్యత్వం..
X

న్యూఢిల్లీ: జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌ను పూర్తి సభ్య దేశంగా చేర్చాలన్న భారత్ ప్రతిపాదనను 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల గ్రూప్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనలో చేర్చారు. సెప్టెంబర్‌లో భారత్ నిర్వహించే శిఖరాగ్ర సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్‌కు పూర్తి సభ్యత్వం ఇవ్వాలని ప్రధాని మోడీ జీ20 సభ్యదేశాలకు గత నెలలో లేఖ రాశారు. ఆఫ్రికా ఖండంలోని 55 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ నుంచి వచ్చిన అభ్యర్థనకు అనుగుణంగా ఈ ప్రతిపాదన చేశారు. భారత్ ప్రతిపాదనకు ఇతర సభ్య దేశాలు సానుకూలంగా స్పందించాయి. కర్ణాటకలోని హంపిలో జీ20 షెర్ఫాల మూడో సమావేశం జరుగుతోంది. ఉమ్మడి నేతల ప్రకటన కోసం సవరించిన ముసాయిదాను రూపొందిస్తున్నారు.

అంతర్జాతీయంగా అన్ని వేదికలపై ఆఫ్రికా స్వరం వినిపించాల్సిన అవసరం ఉందని భారత్ అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన అభివృద్ధిలో ఆఫ్రికన్ దేశాల పాత్ర కీలకంగా భావిస్తోంది. ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశాల మొత్తం జనాభా 130 కోట్ల కంటే ఎక్కువ. ఆఫ్రికన్ యూనియన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో శాశ్వత పరిశీలకుడి హోదాను కలిగి ఉంది. ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత 1999లో స్థాపించబడిన జీ20లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. జీ20లో భారత్‌తో సహా అమెరికా, యూకే, యూరోపియన్ యూనియన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కియే దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed